సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆదేశించింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 85 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేందుకు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలను తరలిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని నీటి పారుదల, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) పరిధిలోని, అనుసంధానం వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా టాస్క్ ఫోర్స్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.
గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ 2 ప్రతిపాదనలు ఇవీ..
► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట)కు మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది.
► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించే 247 టీఎంసీల్లో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.
► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్ ఫోర్స్ కమిటీకి పంపింది.
న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం..
ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తే టాస్‌్కఫోర్స్ కమిటీ పేర్కొన్న మేరకు ప్రయోజనం ఉండదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమై పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని పేర్కొంటున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. లోయర్ గోదావరి సబ్ బేసిన్(జీ–10)లో ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిరి్మంచడానికి 1975 డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 85 టీఎంసీలను మాత్రమే ఇచ్చంపల్లి నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వినియోగించుకోవాలి. ఇచ్చంపల్లిలో అంతర్భాగమైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో ఉమ్మడి ఏపీ 27 శాతం, మహారాష్ట్ర 35 శాతం, మధ్యప్రదేశ్ 38 శాతం చొప్పున భరించాలి. విద్యుత్‌ను ఇదే దామాషాలో పంచుకోవాలి. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసిన జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉంటుంది.
అభిప్రాయాలను తీసుకోకుండానే..
గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ జానంపేట నుంచి గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదనను తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జానంపేట పరిసర ప్రాంతాల నుంచి గోదావరి జలాలను తరలించడానికి ప్రాజెక్టులు చేపట్టిందని, వాటి ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని జానంపేట నుంచి చేపడితే తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు ఈ అనుసంధానం పరిధిలోకి వస్తుందని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచే కావేరికి గోదావరి జలాలను తరలించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ ప్రతులను ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు పంపిన టాస్‌్కఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం పనులు చేపట్టేలా డీపీఆర్ రూపొందించాలని ఆదేశించింది. బేసిన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకల అభిప్రాయాలను తీసుకోకుండానే కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని నీటిపారుదలరంగ, న్యాయ నిపుణులు ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment