మరో ‘అణు’ ఆందోళన
Published Wed, Aug 7 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా చెలరేగిన ఉద్యమం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో మరో ఉద్యమం ఉదయిం చింది. కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు మంగళవారం నిరసన తెలిపారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన మద్రాసు అటామిక్ పవర్ స్టేషన్ (కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం) ఉంది. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ దీనిని మంజూరు చేశారు. మొత్తం 220 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లతో 1984 జనవరి 24న ప్రారంభమైంది. దేశంలోనే ఇది తొలి అణువిద్యుత్ కేంద్రమని చెబుతారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వల్ప అవాంతరాలు మినహా ఈ కేంద్రం సజావుగా సాగుతోంది. ఈ అనుభవంతోనే కూడంకులంలో మరో అణు విద్యుత్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అణు విద్యుత్ కేంద్రానికి అనుకూలంగా కోర్టులు తీర్పు ఇచ్చాయి. దీంతో ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది.
అగ్నిపర్వతమంటూ ప్రచారం
కల్పాక్కం- పుదుచ్చేరికి మధ్యలో అణువిద్యుత్ కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో అగ్నిపర్వతం ఉందనే ప్రచారం జోరందుకుంది. ‘కల్పాక్కం అణుశక్తి కేంద్రం - అగ్నిపర్వతం’ అనే పుస్తకంలో ఈ అంశాన్ని పేర్కొన్నట్లు తెలుసుకున్న స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందని, దీని ప్రభావం అణువిద్యుత్ కేంద్రంపై పడితే గ్రామాలు తుడిచి పెట్టుకుపోగలవని భయపడుతున్నారు. కల్పాక్కం పరిసర గ్రామాల్లోని ప్రజలు మంగళవారం తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. డాక్టర్ పుహళేంది నాయకత్వంలో ప్రజలు ఆందోళనకు దిగారు.
ఈ వాదనను అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ అంశంపై అణువిద్యుత్ కేంద్రం అధికారి ప్రభాత్‌కుమార్ వివరణ ఇచ్చారు. తమిళనాడులో వేలాది ఏళ్లకు ముందు ఆలయాలు, సొరంగాలు ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. సదరు పుస్తకంలో పేర్కొన్నట్లు 250 ఏళ్ల క్రితం అగ్నిపర్వతం ఉన్నట్లు దాఖలాలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అగ్నిపర్వతాల పరిశోధనల పుటల్లో సైతం కల్పాక్కంలో అగ్నిపర్వతం ప్రస్తావన లేదని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.
Advertisement
Advertisement