లెక్క తేలాకే కావేరికి గోదారి | NWDA To Hold Meeting Virtually On Linking Of Rivers Godavari-Cauvery connection | Sakshi
Sakshi News home page

లెక్క తేలాకే కావేరికి గోదారి

Published Thu, Jan 20 2022 2:11 AM | Last Updated on Thu, Jan 20 2022 2:11 AM

NWDA To Hold Meeting Virtually On Linking Of Rivers Godavari-Cauvery connection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చకుండా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టడంలో అర్థం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ స్పష్టం చేశారు. మొదట నీటి లభ్యతను తేల్చాలని, ఆ తర్వాతే కావేరికి గోదావరి జలాలను ఎలా తరలించాలో చర్చించాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 69వ సమావేశం బుధవారం వర్చువల్‌గా జరిగింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా కావేరికి తరలించడం ద్వారా నదులను అనుసంధానం చేయడానికి సంబంధించిన డీపీఆర్‌ను నదీ పరివాహక ప్రాంతాల్లోని 4 రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్‌ చెప్పారు. ఆ డీపీఆర్‌లో హైడ్రాలజీ అంశంపై తమకు అభ్యంతరాలున్నాయని మురళీధర్‌ తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 247 టీఎంసీల నీటిని నదుల అనుసంధానంలో భాగంగా వినియోగించాలని ప్రతిపాదించారని, ఇక్కడ నదిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు పేర్కొన్నారని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 247 టీఎంసీల్లో 70 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్‌ వాటా ఉందని గుర్తు చేశారు. ఇంద్రావతిపై తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు మిగులు జలాలే ఉండవని గత సమావేశంలో ఆ రాష్ట్రం తేల్చిచెప్పిందన్నారు. కాబట్టి ముందు గోదావరిలో నీటి లభ్యత తేల్చాలని కోరారు. 

ఏపీ అవసరాలు తీరాకే తరలింపు: ఆంధ్రప్రదేశ్‌ 
ఆంధ్రప్రదేశ్‌ కూడా ముందు గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని కోరింది. రాష్ట్రంలో కడుతున్న, భవిష్యత్‌లో నిర్మించనున్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోకుండాడీపీఆర్‌ రూపొందించారని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఆక్షేపించారు. గోదావరి జలాలు ఆ ప్రాజెక్టులకే సరిపోతాయని.. నీటి లభ్యత ఎక్కడుందని ప్రశ్నించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఏపీకే గోదావరి ట్రిబ్యునల్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే వరద జలాల్లో మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలన్నారు. దీనిపై సానుకూలం గా స్పందించిన పంకజ్‌కుమార్‌.. గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. 

మా రాష్ట్రంలో కరువు ప్రాంతాలెక్కువ: కర్ణాటక 
తమిళనాడుతో పోల్చితే కావేరి బేసిన్‌లో తమ రాష్ట్రంలోనే కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువని కర్ణాటక చెప్పింది. దుర్భిక్షాన్ని నివారించడానికి గోదావరి జలాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీతో పోల్చితే తమ రాష్ట్రంలోనే కృష్ణా బేసిన్‌లో కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువంది. ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు గానూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కోరింది. 

మిగతా రాష్ట్రాలేమన్నాయంటే..? 
కావేరి–గోదావరి అనుసంధానంలో కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర కోరింది. గోదావరి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని, తమ నీళ్లు తామే వాడుకుంటామని ఛత్తీస్‌గఢ్‌ స్పష్టం చేసింది. ఒడిశా మాత్రం అనుసంధానంపై తమకు అభ్యంతరం లేదంది. కావేరి జలాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని, తాజా అనుసంధానం నేపథ్యంలోనైనా కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. వర్చువల్‌గా కాకుండా భౌతికంగా సమావేశాలు నిర్వహిస్తేనే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి అవకాశం ఉంటుందని తమిళనాడు చెప్పింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని కోరింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement