కావేరి నది జన్మస్థలం తలకావేరి (కూర్గ్, కర్ణాటక)
యష్మి తొమ్మిదో తరగతి విద్యార్థిని. ఐక్యరాజ్యసమితి ‘సముద్ర సదస్సు’ కు ఎంపికైంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే అంశంపై కావేరీ నది మీద యష్మి తీసిన చిన్న డాక్యుమెంటరీ ఆమెకు ఈ అర్హతను కల్పించింది. త్వరలోనే హవాయిలో జరిగే సముద్ర సదస్సులో ప్రపంచంలోని ఆలోచనాపరులతో కలిసి యష్మి కూర్చోబోతోంది! కరోనా కారణంగా ఒకవేళ ఆ సదస్సు ఆన్‌లైన్‌లో జరిగినా తనేమీ నిరుత్సాహపడబోనని, యువతకు తన సందేశం వెళ్లింది అంతే చాలునని యష్మి సంతోషంగా చెబుతోంది. సముద్ర సదస్సుకు కావేరీ నదిని తీసుకెళుతున్న నావిక.. యష్మి.
లాక్‌డౌన్‌లో తాగడానికి నీళ్లు లేక, ఊరికి బారెడు దూరంలో ఎక్కడో కొన్ని స్వచ్ఛమైన నీటి చుక్కలున్నా బయటికి వెళ్లే దారి లేక ఇంట్లోనే బావులు తవ్వుకున్నవాళ్లున్నారు! లాక్‌డౌన్ పర్యవసానాల విశ్వరూపానికి ఇదొక్క ఉదాహరణ చాలు. జీవికి గొంతు తడుపుకోడానికి నీళ్లు లేకపోవడం ఏమిటి! భూగోళమేమీ ఒట్టిపోలేదే?! నదులున్నాయి, చెరువులున్నాయి, ఊటలు, నీటి కుంటలూ ఉన్నాయి. ఉన్నాయి కానీ తాగేందుకు వీల్లేనంతగా కలుషితం అవుతున్నాయి! జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సమీప భవిష్యత్తులో? ‘భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి’ అని ఐక్యరాజ్య సమితి స్కూల్ పిల్లలకు పోటీ పెట్టింది. ఆ ఊహ.. కథ చెప్పినట్లుగా ఉండాలి. ఊహ ‘వీడియో’ రూపంలో ఉండాలి. అదీ నిబంధన. 13–17 మధ్య వయసు గల పిల్లల కోసం జరిగిన ఈ పోటీలో అనేక కేటగిరీలు ఉన్నాయి. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనేది వాటిల్లో ఒకటి. నీరు పవిత్రమైనదని అర్థం. ఆ కేటగిరీలో కొడగు విద్యార్థిని యష్మి విజేతగా నిలిచింది. యష్మి మైసూరులోని ఆచార్య విద్యాకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొడగులోని నెలజి ఆమె స్వగ్రామం.
లాక్‌డౌన్‌లో తన ఊరు ఎలా ఉందో కళ్లారా చూసింది యష్మి. నీరు ఎంత విలువైందో కూడా అప్పుడే ఆమెకు తెలిసింది. తమ ఊరొక్కటే కాదు, రాష్ట్రంలోని అన్ని ఊళ్లూ అలానే ఉన్నాయని పత్రికల్లో చూసింది. నీటి చుక్కకు కరువేమీ లేదు. కలుషితం కాని నీరే.. ఎక్కడా లేదు! అసలే కరోనా. కలుషితమైన నీరు తాగడం వల్ల, గాలిలోని కాలుష్యాలను పీల్చడం వల్ల జబ్బున పడితే, అది కరోనా ఏమోనన్న భయం. ఈ పరిస్థితిని మార్చేందుకు తనేమీ చేయలేదు. ఏం చేయాలో కొంత చెప్పగలదు. కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. రోజులు గడిచాయి. లాక్‌డౌన్ ముగిసింది. యష్మి ఎనిమిది నుంచి తొమ్మిదికి వచ్చింది. ఈ సమయంలో క్లాస్ టీచర్ ఓరోజు యు.ఎన్. హెచ్2ఒ 21 వాటర్ సమ్మిట్ గురించి చెప్పారు. హెచ్2ఒ 21 సమ్మిట్ పేరుతో ఐక్యరాజ్య సమితి టీనేజ్ విద్యార్థులకు భవిష్యత్తులో నీరు అనే టాపిక్ మీద ‘స్టోరీ టెల్లింగ్’ పోటీ పెడుతోంది. అందులో విజేతగా నిలిస్తే, ఆ తర్వాత యూఎస్‌లోని హవాయి రాష్ట్రంలో జరిగే ‘యు.ఎస్. ఓషన్ డికేడ్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆహ్వానం లభిస్తుంది. అదేమీ మామూలు సంగతి కాదు. స్టోరీ టెల్లింగ్‌లో జల సంరక్షణ కోసం విజేతలు ఇచ్చిన సూచనలపై మేధావులు, ఆలోచన పరులు ఓషన్ సమ్మిట్ (సముద్ర సదస్సు)లో చర్చలు జరుపుతారు. అది చాలదా! ‘‘ఇదిగో ఈ అద్భుతమైన ఆలోచనను ఇచ్చింది ఈ అమ్మాయే’’ అని అంతా చప్పట్లు చరుస్తూ అభినందిస్తూ ఉంటే!! క్యాష్ ప్రైజ్, ప్రశంసాపత్రం ఎలాగూ ఉంటాయి.
యష్మి వెంటనే ఆ పోటీలో పాల్గొంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే కేటగిరీని ఎంపిక చేసుకుంది. లాక్‌డౌన్‌లో తన అనుభవాలను పాయింట్లుగా రాసుకుంది. వాతావరణ మార్పులపై ప్రసిద్ధుల ప్రసంగాల నుంచి కొంత నోట్స్ సిద్ధం చేసుకుంది. పోటీలో పాల్గొనడానికి ముందు హెచ్2ఓ 21 నియమ నిబంధనల కోసం ఐక్యరాజ్య సమితి వరుసగా నాలుగు శని, ఆదివారాలు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ తరగతులకు హాజరు అయింది. అక్కడే కేటగిరీల కేటాయింపు జరుగుతుంది. యష్మి ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ కేటగిరీని ఎంపిక చేసుకోడానికి తగిన కారణమే ఉంది. కొడగులోని వాళ్లంతా కావేరీ నదిని దైవంలా పూజిస్తారు. అన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నప్పుడే వాళ్లు చెబుతున్న విషయాలను బట్టి.. తల్లి కావేరి తమను కాపాడుతున్నంతగా, కావేరిని తాము కాపాడుకోవడం లేదని ఆమె గ్రహించింది.
పైగా యష్మి కావేరి నదిని పూజించే కొడవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలోని అమ్మాయి. వెంటనే ఆమె కొడగు వెళ్లిపోయి, కావేరీ నది అందాలను అనేక కోణాలలో షూట్ చేసింది. వాటిని కథానుగుణంగా ఎడిట్ చేసింది. నేపథ్య గీతంగా కొడవలకు ప్రత్యేకమైన భక్తి పాటను ఉంచింది. అంత అందమైన కావేరి నది.. కాలుష్యం కారణంగా ఎలా అంద విహీనం అయిపోతున్నదో చూపించింది. వీడియో చివర్లో ‘లెటజ్ హీల్ హర్. నాట్ ఫిక్స్ హర్’ అనే సందేశంతో.. యువతీ యువకులు కావేరి నది స్వచ్ఛత ను పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృశ్యరూపకంగా జత చేసింది. ఇంత అద్భుతం గా చేశాక యష్మి విజేత కాకుండా ఉంటుందా! అయింది. త్వరలో హవాయి వెళ్లబోతోంది.
‘‘నా చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది. అమ్మ చిన్నప్పుడు కొడగు ప్రాంతం ఎంతో అందంగా ఉండేదట. ‘భారీగా వర్షాలు పడేవి. చెరువులు స్వచ్ఛంగా ఉండేవి. నేను పెరిగి పెద్దయ్యేనాటికి వాతావరణంలో కాలుష్యాలు పెరిగినా వర్షాలేమీ తగ్గలేదు కానీ, నీటి స్వచ్ఛత తగ్గింది. నువ్వు పెద్దయి, నీ తర్వాతి తరం వచ్చాక నువ్వూ.. మా చిన్నప్పుడు ఇలా ఉండేది.. అని చెప్పకూడదని నా ఆశ. అందుకు మీ తరం వారే ఏదైనా చేయాలి. ఏదైనా కాదు. రెండు చేయాలి. కాలుష్యం తగ్గించాలి. పచ్చదనం పెంచాలి’’ అని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పిన మాటలనే నేను హవాయిలో నా వీడియో ప్రెజెంటేషన్‌లో చెబుతాను’’ అంటోంది యష్మి. వీడియో తయారు చేయడానికి తన కజిన్ భువన, ఆమె తండ్రి తనకు సహాయపడ్డారట. యష్మి తల్లి నళిని, తండ్రి కుశలప్ప తమ కూతురి కి యూఎస్ వెళ్లే అవకాశం రావడంతో సంతోషం గా ఉన్నారు. కరోనా కారణంగా ఆమె వెళ్లబోయే ‘ఓషన్ డికేడ్ సమ్మిట్’ అన్‌లైన్‌లో జరిగే అవకాశాలున్నా.. ‘నా సందేశం వెళ్లింది. అంతే చాలు’ అని అంటోంది యష్మి.
Comments
Please login to add a commentAdd a comment