ఎవరి పాపమిది? | water conflivts between tamilnadu and karnataka | Sakshi
Sakshi News home page

ఎవరి పాపమిది?

Published Wed, Sep 14 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

ఎవరి పాపమిది?

ఎవరి పాపమిది?

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరానికి దాదాపు తెలియకుండాపోయిన జల యుద్ధం సోమవారం బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నడిరోడ్లపై వీరంగం వేసింది. అసలు సమస్య కావేరీ నదీ జలాల వివాదంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్యులపైనా, వ్యాపార సంస్థలపైనా విచ్చలవిడిగా దాడులు జరిగాయి. హింసా కాండలో ఇద్దరు మరణించగా... తమిళ పౌరుల వాహనాలు, ఆస్తులు ధ్వంసమ య్యాయి. 100 వాహనాలు కాలి బూడిదైతే అందులోఒక ప్రైవేటు సంస్థ బస్సులే 44 ఉన్నాయి.

తమిళ పౌరులని అనుమానం వస్తే చాలు... చితకబాదారు. మేమేం తక్కువ తిన్నామా అని తమిళనాట కూడా అసాంఘిక శక్తులు రెచ్చిపోయాయి. చెన్నైలో కన్నడిగుల హోటల్‌పై బాంబు దాడి, వాహనాల ధ్వంసం వంటివి చోటు చేసుకున్నాయి. పక్షం రోజులుగా ఉద్రిక్తతలు అలుముకుంటున్నా పట్టనట్టు వ్యవహ రించిన ప్రభుత్వాలు తీరిగ్గా మేల్కొని పోలీసు బలగాల్ని దించి అంతా సర్దుకుం టుందని జనానికి భరోసా ఇస్తున్నాయి. ‘మా రాష్ట్రంవారి ప్రాణాలు, ఆస్తులు కాపా డండ’ని పరస్పరం ఉత్తరాలు రాసుకుంటున్నాయి. ఐటీ దిగ్గజ నగరంగా, అందువల్ల ప్రపంచ ప్రాముఖ్య నగరంగా పేరొందిన బెంగళూరుకు ఈ గతి పట్టిస్తారని ఎవరూ అనుకుని ఉండరు. సరిగ్గా పాతికేళ్లకిందట 1991లో ఈ మాదిరే బెంగళూరులోని తమిళ నివాస ప్రాంతాల్లో దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. నగరం నెల రోజులు అట్టుడికిపోయింది. సాధారణ పౌరులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికారు. హింసాకాండలో 28మంది మరణించగా, వేలాదిమంది నగరం వదిలి వెళ్లిపోయారు.

ఇన్నేళ్లు గడిచినా మారిందేమీ లేదని తాజా ఉదంతాలు రుజువు చేస్తు న్నాయి. రాజధాని నగరాలైన బెంగళూరు, చెన్నైలలో అరాచక శక్తులు గుంపులుగా రోడ్ల మీదికొస్తే ప్రభుత్వాలు గుడ్లప్పగించి చూశాయి. సాధారణ సమయాల్లో ఇంటెలిజెన్స్ ఉన్నదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని డంబాలు పలికే ప్రభుత్వాలు దాదాపు తొమ్మిది గంటలపాటు ఇంత బలహీనంగా మిగిలిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో పాలకులు ఏమైనా చెప్పుకుని ఉండొచ్చుగానీ... తరచుగా తీవ్ర ఘర్షణలకు దారితీయగల వివా దాన్ని అపరిష్కృ తంగా వదిలేశారు.

రెండు రాష్ట్రాల్లోనూ దాడులకు దిగినవారు రైతులు కాదు. వారి పేరు చెప్పుకుని స్వప్రయోజనాలు సాధించుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు ప్రయత్నించాయని స్థానికులు చెబుతున్నారు. 1956నాటి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం చాలా శక్తివంతమైనది. ఆ చట్టంకింద వెలువడిన నిర్ణయాన్ని మార్చడం లేదా అమలుకు నిరాకరించడం ఎవరివల్లా కాదు. తాము అమలు చేయబోమని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మొండికేస్తే దాన్ని బర్తరఫ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికుం టుంది. నదీ జలాల విడుదలను అడ్డుకుంటే అవసరమైతే సైనిక బలగాల్ని దించడా నికి కేంద్రానికి అధికారం ఉంది. అయినా అధికారంలో ఉండేవారు రాజకీయ ప్రయో జనాలను ఆశించి ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. నిర్ణయాల అమలును వాయిదావేస్తూ పోతున్నారు.

తమిళనాడుకు 192 టీఎంసీ (శతకోటి ఘనపుటడుగుల) నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ 2007లో కావేరీ ట్రిబ్యునల్ తుది అవార్డు ప్రకటించినా దాని అమలుపై ఆ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఆ వివాదంలోనే సుప్రీంకోర్టు రోజుకు 15,000 క్యూసెక్కుల (1.3టీఎంసీలు) నీరు ఈనెల 15 వరకూ విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. దాని అమలును ప్రారంభించాక ఉద్రిక్తతలు పెరగడాన్ని గమనించి ఆదేశాలను సవరించాల్సిందిగా కర్ణాటక అభ్యర్ధించింది. పర్యవసానంగా రోజుకు 12,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. శాంతిభద్రతల సమస్య తలెత్తినందున తీర్పు అమలును ఆపాలన్న వినతిని తోసి పుచ్చి చీవాట్లు పెట్టింది. నిజానికి పరిస్థితి ఇంత విషమించడానికి తమిళనాడు బాధ్యత కూడా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమ విజయమంటూ అధికార అన్నాడీఎంకే గొప్పలకు పోవడం కర్ణాటకలో ఉద్వేగాలను రెచ్చగొట్టింది. ఇది అసాంఘిక శక్తులకు ఊతమిచ్చింది.

న్యాయవ్యవస్థ తమ అధికారాలను కబ్జా చేస్తున్నదని వాపోయే ప్రభుత్వాలు కీలకమైన సమస్యలను మాత్రం న్యాయస్థానాల నెత్తిపై వేసి తప్పుకుంటున్నాయి. బాబ్రీ వివాదంతోసహా ఎన్నో చిక్కుముళ్లు దీనికి రుజువు. అన్నిటికన్నా ముఖ్యమైన నదీ జలాల వివాదాలను న్యాయస్థానాలకు వదలడం పాలకుల లౌక్యానికి నిద ర్శనం. అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు అన్ని పార్టీలనూ, ప్రజా సంఘాలనూ విశ్వా సంలోకి తీసుకుని చర్చించడం, పొరుగు రాష్ట్రాలతో మాట్లాడటం వంటివి చేస్తే వేరుగా ఉంటుంది. ప్రజలను ఒప్పించడం సులభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చొరవ చూపించనప్పుడు కేంద్రమైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇదంతా ఎంతో ప్రయాసతో, సమస్యలతో కూడుకున్నది గనుక ఎవరికి వారు తప్పిం చుకుంటున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించడం, వీలైనంతకాలం సమస్యను సాగ దీయడమే పరిష్కారమని భావిస్తున్నారు.

అందువల్లే బెంగళూరు, చెన్నై నగరాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకపక్క పర్యావరణ మార్పుల పర్య వసానంగా వర్షపాతం తగ్గుతోంది. దీనికి మానవ తప్పిదాలు తోడవుతున్నాయి. పట్టణీకరణతో తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. మాఫియాలు ఇసుకను విచ్చలవిడిగా తోడేస్తున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్టు ఉంటున్నాయి. ఫలితంగా గోతులు ఏర్పడి నీటి ప్రవాహం సక్రమంగా ఉండటం లేదు.

జనాభా పెరిగి, అవసరాలు విస్తరించి, అధిక ఆహారోత్పత్తి తప్పకపోవడంవల్ల ప్రతిచోటా ఆయకట్టు పెంచుకోవలసి వస్తున్నది. దాంతో పాటే సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంపొందించే విధానాలను ప్రోత్సహించే దిశగా తగినంత దృష్టి పెట్టడంలేదు. వీటన్నిటి ఫలితమే జలవివాదాలు. నీరు నిప్పుగా మారడం, క్యూసెక్కులు కాటే యడం ఒక్క కావేరీ ప్రాంతానికే పరిమితం కాదు. దేశంలో ఇలాంటి జల వివాదాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు సమస్య నుంచి పరారవడంకాక, దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించడం అవసరం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement