మృతి చెందిన విద్యార్థులు
సాక్షి, చైన్నె: సేలం సమీపంలోని కావేరి నదిలోకి గురువారం సాయంత్రం స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని సంగ గిరిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 10 మంది మధ్యాహ్నం కళాశాలకు డుమ్మా కొట్టి బయటకు వచ్చేశారు. వీరంతా ఎడపాడి సమీపంలోని కల్ వడంగం వద్ద కావేరి నదిలో స్నానానికి వెళ్లారు.
మిత్రులందరూ ఆడుకుంటూ ఆనందంతో స్నానం చేస్తుండగా మణి కంఠన్ అనే విద్యార్థి బురద ప్రాంతంలో కూరుకు పోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించి మరో ముగ్గురు మిత్రులు గల్లంతయ్యారు. మిగిలిన వారు ఆందోళనతో ఒడ్డుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు , గజ ఈతగాళ్లు ఆ పరిసరాలలో గాలించారు. అయితే, నలుగురు విద్యార్థులను మృతదేహాలుగా బయటకు తీశారు.
మరణించిన వారిలో పిమణి కుమారుడు మణి కంఠన్(20), సెల్వం కుమారుడు ముత్తుస్వామి(20), మరో మణికంఠన్(20), పాండియరాజన్(20)గా గుర్తించారు. విద్యార్థుల మరణ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment