రెండో రోజూ సక్సెస్
Published Sun, Dec 8 2013 12:05 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ రెండో రోజు జిల్లాలో విజయవంతమైంది. వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా,విద్యార్థి సంఘాలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి యూపీఏ ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఆందోళనలు చేశారు. గుంటూరుతో పాటు అన్ని పట్టణాల్లో రాస్తారోకోలు, రోడ్లపై టైర్లు దహనం చేయడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెల్లవారుజామునే ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలకు దిగి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులకు వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుంటూరు నగరంలో అరెస్టులు కూడా జరిగాయి. ఏపీఎన్జీవో సంఘాలు, టీడీపీ నేతలు సైతం బైక్ ర్యాలీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలతో పాటు వ్యాపార, వాణిజ్య దుకాణాలన్నీ మూతపడ్డాయి. సినిమా థియేటర్‌లలో ఉదయం వేళ ప్రదర్శనలను నిలిపివేశారు. పలు ప్రజాసంఘాల నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నాయకత్వాన ఐదో నంబర్ జాతీయరహదారిపై రాస్తారోకో, బైక్ ర్యాలీలు చేపట్టారు. గుంటూరులో ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పీఆర్కే నేతృత్వాన స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
గుంటూరు నగరంలో ఉద్రిక్తత
ఉదయాన్నే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తూర్పునియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్ వేర్వేరు ప్రాంతాల నుంచి పాదయాత్ర, బైక్‌ర్యాలీలు చేసుకుంటూ ఆర్టీసీ డిపో వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు పార్టీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. అప్పిరెడ్డి, షౌకత్, నసీర్‌అహ్మద్‌తో పాటు రాతంశెట్టి రామాంజనేయులు (రాము) గులాం రసూల్, మేరిగ విజయలక్ష్మిను పోలీసులు నెట్టివేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం వారిని అరెస్టు చేసి పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మాయాబజార్ సెంటర్‌లో టైర్లు దహనం చేశారు. యువజన విభాగం నేత కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గురజాలలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి , పెదకూరపాడులో సమన్వయకర్త నూతలపాటి హనుమయ్య నాయకత్వంలో బైక్‌ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. బాపట్ల, తెనాలి, పొన్నూరు,
నరసరావుపేటలలో కూడా వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనలు నిర్వహించి మానవహారాలు చేపట్టారు.
విధులు బహిష్కరించిన
ప్రభుత్వ ఉద్యోగులు..
ఏపీఎన్జీవో సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా విధులు బహిష్కరించారు. దీంతో కార్యాలయాన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. టీడీపీ నేతలు కూడా అన్నిచోట్లా ఆందోళనలు నిర్వహించగా, గుంటూరులో ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబును అరండల్‌పేట పోలీసులు గృహనిర్భందం చేశారు. అదేవిధంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నాకు దిగగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిని ఐదుగంటలపాటు స్టేషన్‌లోనే ఉంచడంతో సమాచారం అందుకున్న వైఎస్‌ఆర్ సీపీ నేతలు పోలీసులతో మాట్లాడి విడిపించారు. తెనాలిలో టీడీపీ నేతలు ఓ ఆర్టీసీ బస్సును అడ్డుకుని బస్సు డ్రైవర్ జేబులో ఉన్న ఎస్‌ఆర్ కాపీని చించివేయడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
Advertisement
Advertisement