ఆటోల బంద్ సంపూర్ణం
Published Fri, Sep 13 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రెండు రోజుల ఆటోల బంద్ గురువారం సంపూర్ణంగా జరిగింది. మొదటిరోజు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆటో డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు పాల్వంచ కృష్ణ, మోహన్‌రావు, ప్రసాద్, రమేష్, వసీమ్, రమణ, రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ఇక్కడి పోలీసులు ఆటోడ్రైవర్లపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆటోడ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఈ విషయంలో కొంత గడువు ఇవ్వాలని అడిగినప్పటికీ ఎస్పీ స్పందించకపోవడం దారుణమన్నారు.
ఆటో డ్రైవర్లపై పోలీసుల వేధింపులు మానాలని డిమాండ్ చేశారు. రూ.100 ఉన్న ట్యాక్స్‌ను రూ.1000కి పెంచుతూ ప్రభుత్వం 108 జీవో జారీచేసిందని పేర్కొన్నారు. దీని వల్ల నిరుపేద ఆటోడ్రైవర్లు పూటగడవక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 108 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రైవర్‌ల అక్రమ అరెస్ట్‌లను నిలిపివేయాలని, నాన్ ట్రాన్స్‌పోర్టు లెసైన్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని, జిల్లాలో ఆటోలకు ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేయాలని కోరారు. 60 సంవత్సరాలు దాటిన ఆటోడ్రైవర్లకు రూ.2వేల పింఛన్ ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు బ్యాంకుల ద్వారా పావలావడ్డీకే రుణాలు ఇప్పించాలని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపేందర్, శ్రీను, జాకీ, నబి పాల్గొన్నారు.
వేధింపులు ఆపాలి
పోలీసులు ఆటో డ్రైవర్లను వేధించడం మానుకోవాలని, 108 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఆటోల బంద్‌కు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనెంబర్ 108 వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు భూక్యా శ్రీను, తుమ్మా విష్ణు వర్థన్, ఉపాధ్యక్షులు తాళ్లూరి రాము, హోటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వర్మ, ఉపేందర్, శ్రీను, జి.శ్రీనివాస్, మోహన్, అజర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement