తెగబడ్డ దొంగలు      | Many Thefts In Medak | Sakshi
Sakshi News home page

తెగబడ్డ దొంగలు     

Published Fri, Jun 15 2018 10:25 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

Many Thefts In Medak  - Sakshi

మెదక్‌లో చిందరవందరగా పడేసిన దుస్తులు

మెదక్‌రూరల్‌ : ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని దుండగులు ఇళ్లంతా గుళ్ల చేసిన ఘటన మెదక్‌ మండలం మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన గుడ్డెంగల్‌ కిషన్‌ మంబోజిపల్లిలోని ఎన్డీఎస్‌ఎల్‌ కార్మికుడిగా పనిచేస్తూ, అదే ఎన్డీఎస్‌ఎల్‌ కాలనీలోనే నివసిస్తున్నాడు.

ఈ నెల 8న ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్ళారు. గురువారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి తాళం తీసి లోపలి వెళ్లగా ఇంట్లో రెండు బీరువాలు తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండడం చూసి ఖంగు తిన్నారు. వెనక భాగంలో ఉన్న బాత్‌రూం పైభాగాన ఉన్న సిమెంట్‌ రేకులను పగులకొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డట్లు గుర్తించారు.

బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, అర తులం బంగారు రింగుతో పాటు రూ.4వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్‌రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు. క్లూస్‌టీం ఘటనా స్థలంలో ఆధారలను సేకరించినట్లు తెలిపారు.

రామాయంపేటలో పట్టపగలు చోరీ

తొమ్మిది తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 10 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట పట్టణంలో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగలు జొరబడ్డారు. తొమ్మిది తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 10 వేలు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన చిట్టిమల్లి శ్రీనివాస్‌ తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న ఎస్‌వీఆర్‌ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్నాడు. కిరాణా దుకాణం నడుపుతున్న శ్రీనివాస్‌ ఉదయమే దుకాణానానికి వచ్చాడు.

అతని భార్య ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి రాగా, గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపుల గొళ్లెం ఊడదీసి చోరీకి పాల్పడ్డారు. సజ్జపై ఉంచిన బీరువా తాళాలు దొరికించుకున్న దుండగులు అందు లో ఉంచిన తొమ్మిది తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. పదివేల నగదును ఎత్తుకెళ్లారు. స్థానిక ఎస్‌ఐ మహేందర్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

జహీరాబాద్‌లో చోరీ

రెండున్నర తులాల బంగారం, రూ.25వేల నగదు అపహరణ

జహీరాబాద్‌: జహీరాబాద్‌ పట్టణంలోని ఆనంద్‌నగర్‌ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు తెగబడ్డారు. స్థానికంగా నివాసం ఉంటున్న రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. గమనించిన స్థానికులు దొంగతనం సమాచారాన్ని ఇంటి యజమానికి అందించారు. జహీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement