చేగుంట మండలం నార్సింగ్ వద్ద రైతులపై జరిగిన లాఠీచార్జి ఘటనపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ : చేగుంట మండలం నార్సింగ్ వద్ద రైతులపై జరిగిన లాఠీచార్జి ఘటనపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. దీనిపై ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌ను విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు మెదక్ ఆర్డీవో వనజాదేవి విచారణ జరిపి అందజేసిన నివేదిక ఆధారంగా చేగుంట విద్యుత్‌శాఖ సహాయ ఇంజనీర్ పెంట్యానాయక్‌ను సస్పెండ్‌చేస్తూ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రామాయంపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈకి సిఫార్సు చేశారు.
విద్యుత్ సరఫరాపై రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడంలో ఏఈ విఫలమయ్యారని, రైతులకు అందుబాటులో లేరని ఆర్డీవో విచారణలో తేలిందని శరత్ తెలిపారు. ఏడీఈ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఆర్డీవో నివేదికఆధారంగా ఏఈని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈలు, ఏడీఈలు విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు కనీసం 6 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామికరంగానికి విద్యుత్ కోతను విధించైనా రైతులకు మెరుగైన విద్యుత్‌సరఫరా చేయాలని ఆ శాఖ ఎస్‌ఈని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఇన్‌చార్జి కలెక్టర్‌తో విద్యుత్ సరఫరాపై సమీక్షించినట్టు సమాచారం.