మహారాష్ట్ర బీజేపీ కూటమిదే
జార్ఖండ్‌లోనూ ఎన్డీఏకే మొగ్గు
అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
శనివారం రానున్న ఫలితాలు
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి.
కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.
జార్ఖండ్‌లో టఫ్ ఫైట్
జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment