తీర ప్రాంతంపై ‘మహా’ పార్టీలన్నింటి కన్ను
నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలకు నెలవు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రాంతమే నిర్ణాయకం
ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట
నేడు ‘సేన’ల సమరాంగణం
సాక్షి, నేషనల్ డెస్క్: కొంకణ్.. మహారాష్ట్రలో రాజధాని ముంబై నుంచి సింధుదుర్గ్ దాకా విస్తరించిన సువిశాల తీరప్రాంతం. నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలతో ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలను శాసిస్తూ వస్తున్న ప్రాంతం కూడా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటముల భాగ్యరేఖలను కొంకణే నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపరంగా రాష్ట్రంలో కొంకణే అతి పెద్ద ప్రాంతం. మొత్తం 288 స్థానాల్లో 75 సీట్లు అక్కడే ఉన్నాయి.
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటైన కొంకణ్ అనంతరం శివసేనను ఆదరించింది. ఈ ఎన్నికల్లో శివసేనలోని రెండు వైరి వర్గాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. కొంకణ్‌లోని 75 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 36 సీట్లు ఒక్క ముంబై మహానగర పరిధిలోనే ఉండటం విశేషం. శివసేన (షిండే) సారథి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వస్థలమైన థానే కొంకణ్ ప్రాంత పరిధిలోకే వస్తుంది.
దాంతో ఇక్కడ ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై ఆధిపత్యం చూపి సత్తా చాటడం ఆయనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకప్పుడు ముంబై నుంచి వలస వెళ్లేవారు పంపే మొత్తాలపై ఆధారపడ్డ కొంకణ్‌లో కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. చేపలు, మామిడి, కాజు తదితరాల ఎగుమతితో ఈ ప్రాంతం స్వయంసమృద్ధి సాధించింది. యువత వలసలకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలతో స్థానికంగానే రాణిస్తున్నారు. వాయు, రైలు మార్గాలు ఇతోధికంగా పెరిగాయి. పర్యాటక ఆకర్షణలకు కూడా కొంకణ్ నెలవుగా మారింది.
కమ్యూనిస్టులకు చెక్ పెట్టి...
ముంబై, పరిసర ప్రాంతాల్లోని నూలు మిల్లులు, ఇతర కర్మాగారాల్లో కమ్యూనిస్టులు చాలాకాలం పాటు గణనీయమైన శక్తిగా వెలుగొందారు. 1980ల్లో శివసేన ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి. తొలుత కాంగ్రెస్ మద్దతుతో వారి ఆధిపత్యానికి గండి కొట్టిన సేన, ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టి కొంకణ్ అంతటా ప్రబల శక్తిగా ఎదిగింది. 1990ల నాటికి బీజేపీతో జట్టు కట్టి హిందూత్వవాదంతో మహారాష్ట్రవ్యాప్తంగా హవా చెలాయించింది.
1995కల్లా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1999లో రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఏర్పాటు చేసిన ఎన్సీపీ కూడా కొంకణ్‌లో పోటీదారుగా మారింది. అలా ఈ ప్రాంతంలో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరిగింది. అయితే 2014 నుంచీ పరిస్థితి మారుతూ వస్తోంది. మోదీ మేనియా సాయంతో ముంబై, పరిసర ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటూ వచి్చంది.
ప్రస్తుతం మొత్తం మహారాష్ట్ర తీర ప్రాంతంలోనూ కాషాయ పార్టీ హవా కని్పస్తోంది. ఆగర్భ శత్రువులైన శివసేన, కాంగ్రెస్ 2019 ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య పరిస్థితుల్లో చేయి కలపడం, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అగాఢీ (ఎంవీఏ) పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంకణ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది.
శివసేన అసంతృప్త నేత షిండే బీజేపీ మద్దతుతో పార్టీని చీల్చడమే గాక ఎంవీఏ సంకీర్ణాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా శివసేన కాస్తా షిండే, ఉద్ధవ్ (యూబీటీ) వర్గాలుగా చీలింది. అనంతరం అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో చేరారు. నాటినుంచీ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్‌పీ)గా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి తమదే నిజమైన పారీ్టగా నిరూపించుకోవడం ఈ నాలుగు వర్గాలకూ కీలకంగా మారింది. అలా వీరందరికీ కొంకణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
పట్టణ ప్రాబల్య ప్రాంతం
→ మహారాష్ట్రలో అత్యంత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతంగా కొంకణ్ తీరం గుర్తింపు పొందింది.
→ సింధుదుర్గ్ నుంచి ముంబై దాకా విస్తరించిన కొంకణ్ పరిధిలో పాల్ఘార్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలున్నాయి.
→ ఇక్కడ 75 అసెంబ్లీ స్థానాలతో పాటు 12 మంది లోక్‌సభ స్థానాలున్నాయి.
→ గిరిజన ప్రాబల్య పాల్ఘర్‌లో 6, థానేలో 18, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, రత్నగిరిల్లో కలిపి 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిగతా 36 స్థానాలు ఒక్క ముంబై మహానగరంలోనే ఉన్నాయి.
→ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని ఈ ప్రాంతమే ఆదుకుంది. శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ కూటమికి ఏడు స్థానాలు దక్కాయి.
→ నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న జనాభా, గృహ వసతి, పేదరికం, మౌలిక సదుపాయాల లేమి వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు.
→ కొంకణ్‌పై కోల్పోయిన పట్టును ఈసారి ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది.
మిగతా ప్రాంతాల్లో...
మహారాష్ట్రలో విదర్భ (62 అసెంబ్లీ సీట్లు), మరాఠ్వాడా (46), ఆనియన్ బెల్త్‌గా పేరొందిన ఉత్తర మహారాష్ట్ర (47), పశి్చమ మహారాష్ట్ర (58) ప్రాంతాల్లోనూ అధికార, విపక్ష కూటముల మధ్య గట్టి పోరు నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కింగ్‌మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రుల సంఖ్య భారీగా పెరిగింది. వారిలో కనీసం 30 మంది దాకా నెగ్గడం ఖాయం. చివరికి ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకంగా మారతారు’’ అని మాజీ సీఎం ఛగన్ భుజ్‌బల్ అభిప్రాయపడ్డారు.
–
Comments
Please login to add a commentAdd a comment