మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అదేవిధంగా మునుపెన్నడూలేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో జెండాపాతి రికార్డును సృష్టించగా, శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి.
మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు పార్టీలు కలిపి కనీసం హాఫ్ సెంచరీని కూడా దాటలేకపోయాయి. కాంగ్రెస్ 15, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం సాధించగా, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు మరో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ఇలా దాదాపు అన్ని రీజియన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మహాయుతి కూటమి సత్తాచాటింది .
ముంబైలో...
ముంబైలోని 36 స్థానాల్లో బీజేపీ, శివసేన (శిందే), 6, ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి అత్యధికంగా 22 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి 12 స్థానాలకు పరిమితమైంది. పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 15, శివసేన 6, ఎన్సీపీ (ఏపీ) ఒక స్థానాన్ని గెలుచుకోగా కాంగ్రెస్ 3, శివసేన (యూబీటీ) 9 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచి మాహీం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే పరాజయం పాలయ్యారు. అయితే వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) నుంచి బరిలో దిగి ఆదిత్య ఠాక్రే మాత్రం తన ప్రత్యర్థి మిలింద్ దేవ్రాపై విజయం సాధించి రెండోసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.
మరఠ్వాడాలో...
మరఠ్వాడాలో ఎనిమిది జిల్లాలుండగా మొత్తం 46 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 19, శివసేన (శిందే) 12, ఎన్సీపీ (ఏపీ) ఎనిమిది, మరోవైపు కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) మూడు, ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాలను దక్కించుకున్నాయి.
విదర్భలో...
విదర్భలోని 11 జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో మహాయుతి కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా శివసేన (శిందే) నాలుగు, ఎన్సీపీ (ఏపీ) ఆరు స్థానాల్లో గెలిచాయి. కాగా ఎంవీయే కూటమి మొత్తం 13 స్థానాల్లో గెలుపు సాధించగా, కాంగ్రెస్ తొమ్మిది, శివసేన (యూబీటీ) నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి.
ఉత్తర మహారాష్ట్రలో...
ఉత్తర మహారాష్ట్రలో అయిదు జిల్లాలో మొత్తం 47 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడ అత్యధికంగా మహాయుతి కూటమి 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరోవైపు మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఇక పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 20, శివసేన (శిందే) 11, ఎన్సీపీ (ఏపీ) 11, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి.
చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు దిగ్గజాల ఓటమి
పశ్చిమ మహారాష్ట్రలో...
పశ్చిమ మహారాష్ట్రలోని అయిదు జిల్లాల్లో మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మహాయుతి కూటమి 42 స్థానాలను గెలుచుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 24, శివసేన (శిందే) ఏడు, ఎన్సీపీ (ఏపీ) 11 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఎంవీయే కూటమి 10 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) రెండు, ఎన్సీపీ (ఎస్పీ) ఏడు స్థానాల్లో విజయం సాధించాయి.
కొంకణ్‌లో..
కొంకణ్ రీజియన్ అయిదు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో మహాయుతి ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 16, శివసేన (శిందే), 16, ఎన్సీపీ (ఏపీ) మూడు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఒక్కోస్థానం గెలుచుకున్నాయి.
లాడ్కీబహీణ్‌తో గణనీయంగా మహిళల ఓటింగ్..
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే మహాయుతి గెలుపునకు బాట వేశాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి లాడ్‌కీ బహీణ్ యోజన వీటన్నిటికీ తలమానికంగా నిలిచింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌ల నేతృత్వంలోని బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి ప్రభుత్వం ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మహిళల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని, వీరంతా మహయుతివైపు మొగ్గుచూపడం కూడా మహాయుతి విజయంలో ప్రధానపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ ఇలా అన్ని వర్గాల కోసం ఏదో ఒక పథకం అమలు చేయడం ద్వారా మహాయుతి ప్రభుత్వం అందరినీ ఆకట్టుకోగలిగిందని భావిస్తున్నారు. చెప్పవచ్చు. దీంతోనే ఈ సంక్షేమ పథకాలే మహాయుతి విజయానికి బాట వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment