Marathwada
-
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అదేవిధంగా మునుపెన్నడూలేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో జెండాపాతి రికార్డును సృష్టించగా, శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు పార్టీలు కలిపి కనీసం హాఫ్ సెంచరీని కూడా దాటలేకపోయాయి. కాంగ్రెస్ 15, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం సాధించగా, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు మరో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ఇలా దాదాపు అన్ని రీజియన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మహాయుతి కూటమి సత్తాచాటింది . ముంబైలో... ముంబైలోని 36 స్థానాల్లో బీజేపీ, శివసేన (శిందే), 6, ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి అత్యధికంగా 22 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి 12 స్థానాలకు పరిమితమైంది. పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 15, శివసేన 6, ఎన్సీపీ (ఏపీ) ఒక స్థానాన్ని గెలుచుకోగా కాంగ్రెస్ 3, శివసేన (యూబీటీ) 9 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచి మాహీం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే పరాజయం పాలయ్యారు. అయితే వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) నుంచి బరిలో దిగి ఆదిత్య ఠాక్రే మాత్రం తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించి రెండోసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.మరఠ్వాడాలో... మరఠ్వాడాలో ఎనిమిది జిల్లాలుండగా మొత్తం 46 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 19, శివసేన (శిందే) 12, ఎన్సీపీ (ఏపీ) ఎనిమిది, మరోవైపు కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) మూడు, ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాలను దక్కించుకున్నాయి. విదర్భలో... విదర్భలోని 11 జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో మహాయుతి కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా శివసేన (శిందే) నాలుగు, ఎన్సీపీ (ఏపీ) ఆరు స్థానాల్లో గెలిచాయి. కాగా ఎంవీయే కూటమి మొత్తం 13 స్థానాల్లో గెలుపు సాధించగా, కాంగ్రెస్ తొమ్మిది, శివసేన (యూబీటీ) నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. ఉత్తర మహారాష్ట్రలో... ఉత్తర మహారాష్ట్రలో అయిదు జిల్లాలో మొత్తం 47 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడ అత్యధికంగా మహాయుతి కూటమి 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరోవైపు మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఇక పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 20, శివసేన (శిందే) 11, ఎన్సీపీ (ఏపీ) 11, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు దిగ్గజాల ఓటమిపశ్చిమ మహారాష్ట్రలో... పశ్చిమ మహారాష్ట్రలోని అయిదు జిల్లాల్లో మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మహాయుతి కూటమి 42 స్థానాలను గెలుచుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 24, శివసేన (శిందే) ఏడు, ఎన్సీపీ (ఏపీ) 11 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఎంవీయే కూటమి 10 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) రెండు, ఎన్సీపీ (ఎస్పీ) ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. కొంకణ్‌లో.. కొంకణ్ రీజియన్ అయిదు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో మహాయుతి ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 16, శివసేన (శిందే), 16, ఎన్సీపీ (ఏపీ) మూడు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఒక్కోస్థానం గెలుచుకున్నాయి.లాడ్కీబహీణ్తో గణనీయంగా మహిళల ఓటింగ్..ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే మహాయుతి గెలుపునకు బాట వేశాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి లాడ్కీ బహీణ్ యోజన వీటన్నిటికీ తలమానికంగా నిలిచింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంలోని బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి ప్రభుత్వం ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మహిళల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని, వీరంతా మహయుతివైపు మొగ్గుచూపడం కూడా మహాయుతి విజయంలో ప్రధానపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ ఇలా అన్ని వర్గాల కోసం ఏదో ఒక పథకం అమలు చేయడం ద్వారా మహాయుతి ప్రభుత్వం అందరినీ ఆకట్టుకోగలిగిందని భావిస్తున్నారు. చెప్పవచ్చు. దీంతోనే ఈ సంక్షేమ పథకాలే మహాయుతి విజయానికి బాట వేశాయి. -
లాక్డౌన్: ఆగని బలవన్మరణాలు
ముంబై: కరోనా సంక్షోభంలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. లాక్డౌన్ సమయంలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో సగటున రోజుకు ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. లాక్డౌన్ సమయంలో(మార్చి-ఏప్రిల్) 109 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 231 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మార్చిలో 73, ఏప్రిల్‌లో 36 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో దాదాపు 1.87 కోట్ల జనాభా ఉండగా, అన్ని జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పుడున్న కష్టాలకు తోడు కోవిడ్-19 సంక్షోభం తోడుకావడంతో రైతుల బాధలు అధికమయ్యాయని షెట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వత్ అన్నారు. వ్యవసాయ రంగంపై కరోనా సంక్షోభం ప్రభావం చాలా రోజుల పాటు కొనసాగే అవకాశముందని, రైతులకు మరిన్ని కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ‘వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ లేదు. లాక్డౌన్ సమయంలో రైతులు తమ ఫలసాయాన్ని 10 శాతం కూడా అమ్మలేకపోయారు. విత్తనాలు విత్తడానికి, వారి కుటుంబాలను చూసుకోవడానికి రైతుల వద్ద డబ్బు లేద’ని ఆయన వివరించారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం 2011 జనవరి నుంచి 2014 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 6,268 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఈ సంఖ్య దాదాపు రెట్టింపు(11,995) ఆత్మహత్యలు 2015-18 మధ్యకాలంలో నమోదు కావడం మహారాష్ట్రలో రైతుల దుస్థితికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. (అదే వరస..ఆగని కరోనా కేసులు..) -
మరాఠ్వాడాలో మరణ మృదంగం
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పలితాల అనంతరం అధికారం కోసం ఒకవైపు కుమ్ములాటలు కొనసాగుతున్న సమయంలోనే ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 300 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం ప్రకటించింది. 2019 అక్టోబరు 14 నుంచి 2019 నవంబరు 11వ తేదీ వరకు ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే 68 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, 2019 నవంబరు నెలలో 300 రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దిగ్భ్రాంతికర విషయాన్ని రెవెన్యూ శాఖ శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్‌లో అకాల వర్షాల కారణంగా మరాఠ్వాడాలో 70 శాతం ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలో ఆత్మహత్యలు 61 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. ఇలా ఒకే నెలలో 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం 2015లోనూ చోటుచేసుకుందని తెలిపింది. -
విదర్భ, మరాఠ్వాడాలను కుదిపేస్తున్న భారీ వర్షాలు
సాక్షి, ముంబై : గత రెండు రోజులుగా విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 11 మంది చనిపోయారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గడచిన రెండు రోజుల్లో మరాఠ్వాడలోని నాందేడ్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే పంటలు, విత్తనాలు, ఎరువుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక భారీ వర్షాలకు పంటలకు నష్టం జరగడంతోపాటు ఇళ్లు కూడా కూలిపోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత.. మంగళవారం భండార జిల్లాలో భారీ వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇదే జిల్లాలో కోండి గ్రామంలో నాలా పొంగిపోర్లి పారడంతో దీనికి ఆనుకుని ఉన్న బస్తీ నీటిలో కొట్టుకుపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా రాత్రి నిద్రలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. భండార జిల్లాలో నాలాలు పొంగిపొర్లడంతో ఇక్కడుంటున్న వందలాది పేద కుటుంబాలను, ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 113 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉప్పొంగుతున్న నదులు.. నాగ్‌పూర్ జిల్లాలో వరదలు రావడంతో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. నాగ్‌పూర్ సిటీలో వచ్చిన వరదలకు ఓ చిన్న పిల్లాడు నీటిలో పడి గల్లంతయ్యాడు. నాందేడ్‌లో వరదలకు నలుగురు గల్లంతయ్యారు. పర్భణీ జిల్లాలో గంగాఖేడ్ తాలూకాలో నాలుగు గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హింగోళి జిల్లాలో వైన్‌గంగా పొంగిపొర్లడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. నాసిక్ జిల్లాలో గోదావరి నది నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ముందు జాగ్రత్త చర్యగా నదికి ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జల్గావ్ జిల్లాలో హత్నూర్ డ్యాంలో ఒక్కసారిగా నీటి నిల్వలు పెరిగిపోవడంతో 32 గేట్లు ఎత్తివేశారు. దీంతో తాపి నది పొంగిపొర్లుతుంది. జల్గావ్ జిల్లాలో 24 గంటల్లో 31.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే వివిధ పెద్ద డ్యాముల్లో 51.17 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. గడచిన రెండు రోజుల్లో అత్యధిక వర్షపాతం మరాఠ్వాడలోని నాందేడ్ జిల్లాలో నమోదైంది. ముంబైకర్లకు ఊరట.. ముంబైలో గత వారం రోజులుగా జల్లులు కురుస్తుండటంతో ముంబైకర్లకు కొంత ఊరట కలిగినట్లైంది. మొన్నటి వరకు వేసవిని తలపింపజేసినా, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడటంతో ముంబైకర్లకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఇక ముంబైకి నీటి సరఫరాచేసే ఆరు జలాశయాల్లో భాత్సా జలాశయం ఓవర్ ఫ్లో అయింది. దీంతో మూడు గేట్లు ఎత్తివేసి 68.67 క్యూసెక్కుల నీరు వదిలేశారు. తాన్సా, వైతర్ణ, మధ్య వైతర్ణ, మోడక్‌సాగర్ జలాశయాలు కూడా ఇదివరకే ఓవర్ ఫ్లో అయ్యాయి. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉండటంతో భాత్సా జలాశయానికి సమీపంలో ఉన్న రెండు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
కేకు కట్ చేసి... వివాదంలో చిక్కుకున్నాడు
ముంబై : మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి అన్నీ తన జన్మదినం సందర్బంగా రాష్ట్ర మ్యాప్ ఆకారంలో ఉన్న కేకును కట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 66వ జన్మదినం సందర్భంగా మంగళవారం అర్థరాత్రి విదర్భ ప్రాంతంలో బాంద్రాలోని శ్రీహరి అన్నీ తన నివాసంలో ఈ మ్యాప్ ఉన్న కేకును నాలుగు భాగాలుగా కట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అవి రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ సృష్టిస్తున్నాయి. కాగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికీ ఆయన కిందటి నెలలో రాజీనామా చేశారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న శ్రీహరి ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీహరి కేకు కట్ చేయడంపై పలువురు రాజకీయ ప్రముఖులు ఈ విధంగా స్పందించారు. శ్రీహరి ఈ రోజు జరుపుకున్న జన్మదిన వేడుకలు చాలా కాలం గుర్తుంటాయని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్ర మ్యాప్ ఆకారంలో ఉన్న కేక్ కట్ చేయటంలో తప్పేమీ లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు శ్రీహరి అన్నీ సన్నిహితుడిగా పేరుంది. -
లాతూర్ చేరుకున్న వాటర్ ట్రైన్
ముంబై: మరఠ్వాడ ప్రజలకు 50 లక్షల లీటర్ల నీటితో బయల్దేరిన వాటర్ ట్రయిన్ మంగళవారం ఉదయం లాతూర్ చేరుకుంది. తీవ్ర కరువు, నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మరఠ్వాడలోని లాతూర్కు నీరు అందించేందుకు ఈ రైలు పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి నిన్న బయల్దేరింది. పది వ్యాగన్లతో చేరుకున్న ఈ రైలును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు లాతూర్కు తరలివచ్చారు. రైలులో చేరుకున్న నీటిని పైప్ లైన్ల ద్వారా తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలోనే నీటిని లాతూర్కు పంపిణీ చేయనున్నారు. కాగా భయంకర నీటి ఎద్దడిని పారదోలేందుకు మహారాష్ట్ర సర్కార్ నడుం బిగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి కేంద్ర రైల్వేశాఖ సహాయంతో రైళ్లలో నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అక్కడ నుంచి 50 వ్యాగన్ల రైలు ఆదివారం మిరాజ్ కు చేరుకుంది. మరో 50 వ్యాగన్లతో కూడిన రెండో రైలు ఈ నెల 15న మిరాజ్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. -
మహా దుర్భిక్షం: రైళ్ల ద్వారా మంచినీటి సరఫరా
తినడానికి గింజలులేవు.. కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా దొరకటంలేదు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. పరిస్థితి విషమించి ఆసుపత్రులకు తీసుకెళితే డాక్టర్లు సైతం చేతులెత్తేసే పరిస్థితి. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క ఆసుపత్రిలోనూ నీళ్లు లేవు. అత్యవసర ఆపరేషన్లను సైతం వైద్యులు వాయిదావేస్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో తీవ్ర దుర్భిక్షంగా భావిస్తోన్న మహారాష్ట్ర కరువుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. వాస్తవ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు బృహత్ కార్యక్రమం చేపట్టింది మహారాష్ట్ర సర్కారు. రాజస్థాన్ లోని ఒక డ్యామ్ నుంచి రైలుద్వారా నీళ్లను తరలించేందుకు భారీ సన్నాహాలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నీటి రవాణాకు వినియోగించే 60 బోగీల(ట్యాంకుల) రైలును ఏర్పాటుచేశారు రైల్వే అధికారులు. రాజస్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నీళ్లను మోటార్ల ద్వారా ట్యాంకుల్లో నింపి కరువు కేంద్రం లాతూర్ పట్టణానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే డ్యామ్ నుంచి నీళ్లను నింపటం ఆసత్యమవుతున్నందున తొలి విడతగా 10 బోగీ(ట్యాంకు)లతో కూడిన రైలు ఆదివారం సాయంత్రం లాతూర్ కు బయలుదేరింది. శుక్రవారంలోగా మిగిలిన 50 బోగీల నీటిని కూడా తరలిస్తామని అధికారులు చెప్పారు. రైలు ద్వారా మొత్తం 5 లక్షల లీటర్ల నీటిని కరువు ప్రాంతానికి చేరవేయనున్నారు. మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్రదుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటివారానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నెలలో అధికం కానున్న ఎండలకు ఎలా తట్టుకోవాలా? అని జనం బెంబేలెత్తిపోతున్నారు. -
త్వరలో పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటన
- మరాఠ్వాడ నుంచి ప్రారంభం - వెల్లడించిన ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు తట్కరే - నవీముంబై గెలుపు ఆత్మవిశ్వాసం పెంచిందని వెల్లడి సాక్షి, ముంబై: కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యటనలో పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు, పదాధికారులు పాల్గొంటారు. మే ఒకటో తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాతి రోజు నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్ల నుంచి వరుసగా కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న మరాఠ్వాడ రీజయన్ నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ఎన్సీపీలో ఆవిరైన ఆశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్రంలో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే ధీమా పార్టీ నాయకుల్లో నింపాయి. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ నాలుగో స్థానానికే పరిమితమైంది. వరుస పరాజయాలతో కుంగిపోయిన పదాధికారులకు, కార్యకర్తలకు నవీముంబై ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి. శాసనసభ ఎన్నికల తరువాత ఎన్సీపీకి బీజేపీ దగ్గర కావడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. దీంతో సందిగ్ధాన్ని తొలగించేందుకు పుణే, అలీబాగ్ ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించనున్నారు. నవీముంబైలో గణేశ్ నాయిక్ వల్లే ఎన్సీపీ విజయం సాధించిందని, అది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిందని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందు కోసమే పవార్ పర్యటనను ఖరారు చేసినట్లు తెలిపారు. మరాఠ్వాడ పర్యటన అనంతరం విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పవార్ పర్యటిస్తారని తట్కరే చెప్పారు. ఆయనతోపాటు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, దిలీప్ వల్సే పాటిల్ తదితర కీలక నేతలు కూడా పర్యటిస్తారని తట్కరే చెప్పారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోయిందని, ఆ స్థానం ఆక్రమించాలని కార్యకర్తలకు ఉద్బోధించాలన్నారు. -
మూడు నెలలు ... 200 మంది ఆత్మహత్య
ఔరంగబాద్: ఎండలు మండిపోతున్నాయి. వానలు... పడాల్సిన సమయంలో పడటం లేదు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంట పండితేనే తమ బతుకు పండుతుందని రైతుకు ఓ చిన్న ఆశ. ఆ ఆశతోనే బ్యాంకు లోన్ ఇస్తే వాటి ద్వారా బోర్లు వేసుకుంటే... కష్టాలు తీరతాయనుకున్నారు. ఆ క్రమంలో లోన్లు కోసం బ్యాంకు మెట్లు ఎక్కారు. లోన్ తీసుకుని బోర్లు వేశారు. బోర్లలో చుక్క నీరు పడలేదు... అలాగే వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోయాయి. చేసిన అప్పులు తీర్చాలంటూ రైతులపై బ్యాంకర్లు ఒత్తిడి... రోజురోజూకు పెరుగుతుంది. అప్పు తీర్చేందుకు పైసా కూడా లేకపోవడంతో మహారాష్ట్ర మరట్వాడా ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల రైతులు మరణమే శరణ్యమని భావించారు. దాంతో ఒకరు ఇద్దరు కాదు... ఏకంగా 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అది మూడు నెలల కాలవ్యవధిలోనే. గతేడాది ఇదే ప్రాంతంలో మొత్తం 510 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
నేడే రెండో దశ
సాక్షి, ముంబై: పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, కొంకణ్‌లోని 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్ని రోజులు రాజకీయ నేతల ప్రసంగాలను విన్న ఓటర్లు నేడు తమ ఓటుతో అభ్యర్థుల తలరాతలు రాసేందుకు సిద్ధమయ్యారు. 36,879 పొలింగ్ కేంద్రాల్లో సుమారు 3.25 కోట్ల మంది తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందే చేసిపెట్టింది. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ఎండలో వచ్చి ఓటువేసే వారికి పొలింగ్ కేంద్రం వద్ద మంచినీరు అందుబాటులో ఉంచింది. వృద్ధులు, వికలాంగులకు తగిన ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు మొహరించారు. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే, మాజీ సీఎం అశోక్ చవాన్, సుప్రీయా సూలే , విజయ్ సింహ్ మోహితే పాటిల్, పద్మసింహ్ పాటిల్, నీలేష్ రాణే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖాముఖి పోటీ... రెండో దశలో ఎన్నికలు జరుగనున్న 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ డీఎఫ్ కూటమి, మహాకూటమిల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ఎన్నికల ప్రచారం చివరిరోజు వరకు కాంగ్రెస్ కూటమి ప్రచారం కోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రచారం చేశారు. మహాకూటమి కోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత గోపీనాథ్ ముండే తదితరులు ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశంలోనే తొలిసారిగా బీజేపీ అత్యాధునిక సాంకేతిక పరిఙ/ా్ఞనాన్ని వినియోగించుకుంది. మోడీ కోసం త్రీడి సభలను ఏర్పాటు చేసింది. మోడీ వేరే ప్రాంతంలో మాట్లాడుతున్నప్పటికీ త్రీడీ టెక్నాలజీ కారణంగా మనముందే ఉన్నట్టు, మనవైపే చూస్తూ మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఇలా తొలిసారిగా ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ సభకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అందరి దృష్టి సింధుదుర్గావైపు... రెండో దశలో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ నియోజకవర్గంవైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే, శివసేన అభ్యర్థి వినాయక్ రావుత్ల మధ్య గట్టిపోటీ కన్పిస్తోంది. సింధుదుర్గాలో రాణే ప్రభావం ఉన్నా గత కొంతకాలంగా మారిన రాజకీయ సమీకరణాలు రాణే వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు కేసకర్ రాణేకు ప్రచారం చేయడానికి నిరాకరించి అధిష్టానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేసకర్ మద్దతుదారులు శివసేనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, అహ్మద్నగర్లోనూ ఈసారి తీవ్ర పోటీనే నెలకొంది. గత ఎన్నికల్లో సుమారు 47 వేల ఓట్ల మెజార్టీతో ఎన్సీపీ అభ్యర్థి శివాజీ భానుదాస్ కర్దిలేపై విజయం సాధించిన దిలీప్ కుమార్ ఈసారి విజయం కోసం చెమటోడుస్తున్నారు. అయితే ఈసారి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాజీవ్ రాజలేను ఎన్సీపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. షిర్డీలో శివసేన అభ్యర్థిగా సదాశివ్ లోకాండే, కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ బావ్సాహెబ్ వాక్చౌరే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
విదర్భను అభివృద్ధి చేస్తాం
అమరావతి: విదర్భ, మరాఠ్వాడాలో వెనుకబాటుతనాన్ని తొలగించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం డాక్టర్ విజయ్ కేల్కర్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేల్కర్ అందజేయబోయే నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా చర్యలు నిర్వహించి, దాని సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరాఠ్వాడా, విదర్భలో ప్రస్తుత వెనుకబాటుతనాన్ని కేల్కర్ కమిటీ మదింపు చేసి నివేదిక అందజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వసంత్‌రావ్ నాయక్ శతజయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన, సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పైవిషయం తెలిపారు. కేల్కర్ నివేదిక నెల రోజుల్లోపు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. అయితే చవాన్ మాట్లాడడం ప్రారంభించగానే సభలోనే ఉన్న విదర్భ ఉద్యమ కార్యకర్తలు పలువురు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మావల సంఘటన అధ్యక్షుడు బాలాసాహెచ్ కొరాటే విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి వివరించి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించారు. విదర్భలో పారిశ్రామిక అభివృద్ధి కొరవడడంపైనా చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పారిశ్రామిక విధానంలో ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. విదర్భ వ్యవసాయ అభివృద్ధికి తగిన నీటిపారుదల వ్యవస్థను నిర్మించాల్సి ఉందన్నారు. చెరకు రైతులు భారీగా నీటిని ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. కాబట్టి వాళ్లు బిందుసేద్య విధానాన్ని అనుసరించాలని కోరారు. ‘ప్రత్యేక’మైతే ఆత్మహత్యలుండవు నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో నాగపూర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అశిష్ దేశ్‌ముఖ్ ప్రారంభించిన ఐదురోజుల పాదయాత్ర బుధవారానికి సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకోనుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపు కుటీర్ ఆశ్రమం వద్ద ఇది ముగియనుంది. అశిష్ దేశ్‌ముఖ్ వెంట వేలాది మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకునేందుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ పాదయాత్ర ఉంది. ఈ సందర్భంగా అశిష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడతాయన్నారు. పంటలు పండక అప్పుల పాలైన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన పనిచేస్తుందన్నారు. విదర్భ ప్రాంతంలో జరిగే వేలాది ఆత్మహత్యలు మహారాష్ట్రకు అపకీర్తిని తేవడమే కాకుండా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది మనకు స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. విదర్భ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి అభివృద్ధిబాట పడుతుందన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగానికి చెందిన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంటుందని వివరించారు. ఈ ప్రాంతం వెనుకబాటుతనం వల్ల నక్సలిజం పెరుగుతోందని, అయితే రాష్ట్ర సర్కార్ దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూపెడుతుందన్నారు. ప్రాంతీయస్థాయిలో ప్రథమ ప్రాధాన్యతగా ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే సమర్థవంతంగా నక్సలిజాన్ని ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలోని 75 శాతం మంది గ్రామీణులు వ్యవసాయంపై ఆధారపడే బతుకుతున్నారని తెలిపారు. 55 లక్షల హెక్టార్ల భూమి ఉండగా 10 లక్షల హెక్టార్లలో మాత్రమే కొద్దిగా వ్యవసాయం సాగుతోంది. వర్షంపైనే ఆధారపడే రైతులు మాత్రం అన్ని విధాలా నష్టపోతున్నారని చెప్పారు. ఏటా ఒక పంటను మాత్రమే పండించగలుగుతున్నారని తెలిపారు. గత 53 ఏళ్ల నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. పత్తి, నారింజ, వరి, సోయాబిన్ ప్రధాన పంటలుగా ఉన్నా వాటి వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని వాపోయారు. ఇక్కడ పంటల నాణ్యత, మార్కెటింగ్, గిడ్డంగులు అభివృద్ధిపై సర్కార్ సరిగా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం చొరవ తీసుకుంటున్న యూపీఏ ప్రత్యే విదర్భ కోసం కూడా చర్యలు తీసుకోవాలని అశీష్ డిమాండ్ చేశారు.