- మరాఠ్వాడ నుంచి ప్రారంభం
- వెల్లడించిన ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు తట్కరే
- నవీముంబై గెలుపు ఆత్మవిశ్వాసం పెంచిందని వెల్లడి
సాక్షి, ముంబై: కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యటనలో పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు, పదాధికారులు పాల్గొంటారు. మే ఒకటో తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాతి రోజు నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్ల నుంచి వరుసగా కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న మరాఠ్వాడ రీజయన్ నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది.
ఇటీవల జరిగిన నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ఎన్సీపీలో ఆవిరైన ఆశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్రంలో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే ధీమా పార్టీ నాయకుల్లో నింపాయి. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ నాలుగో స్థానానికే పరిమితమైంది. వరుస పరాజయాలతో కుంగిపోయిన పదాధికారులకు, కార్యకర్తలకు నవీముంబై ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి.
శాసనసభ ఎన్నికల తరువాత ఎన్సీపీకి బీజేపీ దగ్గర కావడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. దీంతో సందిగ్ధాన్ని తొలగించేందుకు పుణే, అలీబాగ్ ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించనున్నారు. నవీముంబైలో గణేశ్ నాయిక్ వల్లే ఎన్సీపీ విజయం సాధించిందని, అది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిందని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందు కోసమే పవార్ పర్యటనను ఖరారు చేసినట్లు తెలిపారు. మరాఠ్వాడ పర్యటన అనంతరం విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పవార్ పర్యటిస్తారని తట్కరే చెప్పారు. ఆయనతోపాటు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, దిలీప్ వల్సే పాటిల్ తదితర కీలక నేతలు కూడా పర్యటిస్తారని తట్కరే చెప్పారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోయిందని, ఆ స్థానం ఆక్రమించాలని కార్యకర్తలకు ఉద్బోధించాలన్నారు.
త్వరలో పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటన
Published Sat, Apr 25 2015 10:54 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement