న్యూఢిల్లీ/ముంబై: మరో ఒకటి, రెండు రోజుల్లో ఎన్సీపీ సానుకూలంగా స్పందించకపోతే ప్రజాస్వామ్య కూటమి ఇబ్బందుల్లో పడే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే కిందటిసారి తాము 174 సీట్లలో పోటీ చేశామని, ఈసారి కూడా ఆ స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని ఆయన వివరించారు.
శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో సీట్ల పంపకంపై ఇంకా ఒప్పందం కుదరకపోతే మొత్తం 288 సీట్లకూ అభ్యర్థులను నిలబెట్టే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. ఏదేమైనా పొత్తును, సీట్లను ఖరారు చేయాల్సింది తమ పార్టీ అధిష్టానమేనని ఆయన స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా, ఎన్సీపీ 114 నియోజకవర్గాల్లో బరిలోకి దిగింది. ఈసారి తమకు సగానికి సగం 144 సీట్లు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రెండు పార్టీల భాగస్వామ్యం 50:50గా ఉండాలని అంటోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలో సోనియాగాంధీతో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్సీపీతో సీట్ల పంపకం అంశాలపై చర్చించారు. ఎన్సీపీకి 130 సీట్లు ఇవ్వాలని ఆ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలి పాయి. ఈసారి ఎన్నికల్లో సీఎం పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మాణిక్‌రావ్ నిరాకరించారు. తన సొంత జిల్లా సతారాలోని కరాద్ దక్షిణ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చవాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విధానమండలి సభ్యునిగా ఉన్నారు.
‘పొత్తు’ మెడపై కత్తి
Published Sat, Sep 20 2014 11:18 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement