అమరావతి: విదర్భ, మరాఠ్వాడాలో వెనుకబాటుతనాన్ని తొలగించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం డాక్టర్ విజయ్ కేల్కర్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేల్కర్ అందజేయబోయే నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా చర్యలు నిర్వహించి, దాని సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరాఠ్వాడా, విదర్భలో ప్రస్తుత వెనుకబాటుతనాన్ని కేల్కర్ కమిటీ మదింపు చేసి నివేదిక అందజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వసంత్‌రావ్ నాయక్ శతజయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన, సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పైవిషయం తెలిపారు.
కేల్కర్ నివేదిక నెల రోజుల్లోపు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. అయితే చవాన్ మాట్లాడడం ప్రారంభించగానే సభలోనే ఉన్న విదర్భ ఉద్యమ కార్యకర్తలు పలువురు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మావల సంఘటన అధ్యక్షుడు బాలాసాహెచ్ కొరాటే విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి వివరించి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించారు. విదర్భలో పారిశ్రామిక అభివృద్ధి కొరవడడంపైనా చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పారిశ్రామిక విధానంలో ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. విదర్భ వ్యవసాయ అభివృద్ధికి తగిన నీటిపారుదల వ్యవస్థను నిర్మించాల్సి ఉందన్నారు. చెరకు రైతులు భారీగా నీటిని ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. కాబట్టి వాళ్లు బిందుసేద్య విధానాన్ని అనుసరించాలని కోరారు.
‘ప్రత్యేక’మైతే ఆత్మహత్యలుండవు
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో నాగపూర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అశిష్ దేశ్‌ముఖ్ ప్రారంభించిన ఐదురోజుల పాదయాత్ర బుధవారానికి సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకోనుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపు కుటీర్ ఆశ్రమం వద్ద ఇది ముగియనుంది. అశిష్ దేశ్‌ముఖ్ వెంట వేలాది మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకునేందుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ పాదయాత్ర ఉంది. ఈ సందర్భంగా అశిష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడతాయన్నారు.
పంటలు పండక అప్పుల పాలైన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన పనిచేస్తుందన్నారు. విదర్భ ప్రాంతంలో జరిగే వేలాది ఆత్మహత్యలు మహారాష్ట్రకు అపకీర్తిని తేవడమే కాకుండా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది మనకు స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. విదర్భ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి అభివృద్ధిబాట పడుతుందన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగానికి చెందిన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంటుందని వివరించారు.
ఈ ప్రాంతం వెనుకబాటుతనం వల్ల నక్సలిజం పెరుగుతోందని, అయితే రాష్ట్ర సర్కార్ దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూపెడుతుందన్నారు. ప్రాంతీయస్థాయిలో ప్రథమ ప్రాధాన్యతగా ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే సమర్థవంతంగా నక్సలిజాన్ని ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలోని 75 శాతం మంది గ్రామీణులు వ్యవసాయంపై ఆధారపడే బతుకుతున్నారని తెలిపారు. 55 లక్షల హెక్టార్ల భూమి ఉండగా 10 లక్షల హెక్టార్లలో మాత్రమే కొద్దిగా వ్యవసాయం సాగుతోంది. వర్షంపైనే ఆధారపడే రైతులు మాత్రం అన్ని విధాలా నష్టపోతున్నారని చెప్పారు. ఏటా ఒక పంటను మాత్రమే పండించగలుగుతున్నారని తెలిపారు. గత 53 ఏళ్ల నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. పత్తి, నారింజ, వరి, సోయాబిన్ ప్రధాన పంటలుగా ఉన్నా వాటి వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని వాపోయారు. ఇక్కడ పంటల నాణ్యత, మార్కెటింగ్, గిడ్డంగులు అభివృద్ధిపై సర్కార్ సరిగా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం చొరవ తీసుకుంటున్న యూపీఏ ప్రత్యే విదర్భ కోసం కూడా చర్యలు తీసుకోవాలని అశీష్ డిమాండ్ చేశారు.
విదర్భను అభివృద్ధి చేస్తాం
Published Wed, Oct 2 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement
Advertisement