నాగపూర్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల 12 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ముంబైలో గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పరిస్థితిపై సమీక్షించి తీసుకోవల్సిన పునరావాల్సిన చర్యల గురించి చర్చిస్తామని చెప్పారు. నాగపూర్ జిల్లా నార్కేడ్ తాలూకాలోని మోహ్‌గావ్ భటడేలో ధ్వంసమైన గోధుమ, ఆరెంజ్ తోటలను సందర్శించి రైతులను పరామర్శించారు.
ఆయన వెంట రాష్ర్ట పునరావాస మంత్రి పతంగ్‌రావ్ కదమ్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, ఆర్థిక సహాయ మంత్రి రాజేంద్ర ములాక్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నాగపూర్ డివిజిన్‌లో ఆరుగురు మృతి చెందగా, 47 పశువుల మృతి చెందాయని జిల్లా యంత్రాంగ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 10,261 ఇళ్లు ధ్వంసమయ్యాని తెలిపింది. నాగపూర్ జిల్లాలో కాంప్టీ, హింగానా, సావ్‌నర్, కటోల్, కలమేశ్వర్, నార్కేడ్, రాంటెక్, పర్‌సివోని, మౌడా, భివపూర్, కుహిలలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది.
చంద్రపూర్ జిల్లాలోని భండారా, పవోని, సకోలి, లకంద్‌పూర్, గోరేగావ్, గోండియా, వరోరాలలోనూ పంటలు, తోటలు నాశనమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలావుండగా విదర్భలోని యావత్మల్, వాషీమ్ జిల్లాలోనూ సీఎం చవాన్ పర్యటించారు. పంటనష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
వర్షాల ధాటికి 28 మంది మృతి
గత పది రోజుల నుంచి రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాల వల్ల 28 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఈ అకాల వర్షాల ప్రభావం 29 జిల్లాలపై ఉందన్నారు. 18,200కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. తొమ్మిది వేలకు పైగా పశువులు మృతి చెందాయని తెలిపారు.
నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
నాసిక్: అకాల వర్షాలతో పాటు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లిగడ్డ, గోధుమ, దానిమ్మ తోటల నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. నిపడ్, చంద్‌వాడ్, దేవ్లా, సతానా, మాలేగావ్‌లో ఈ బృందం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలి పాయి. ఆ తర్వాత ధులేకు వెళుతుందన్నారు.
‘12 లక్షల హెక్టార్లలో పంట నష్టం’
Published Wed, Mar 12 2014 10:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement