Manik rao Thakre
-
Telangana: కామ్రేడ్స్‌తో కాంగ్రెస్ దోస్తీ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్తో బ్రేకప్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాయబారం మొదలుపెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఓ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు ఉండటం, ఇతర జిల్లాల్లోనూ అనేక చోట్ల ప్రభావితం చేయగలిగే పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు సిద్ధం కావాలని యోచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావుఠాక్రే కమ్యూనిస్టులతో మధ్యవర్తిత్వం మొదలుపెట్టారు.హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. ‘బీజేపీని ఓడించాలన్న కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధం. అందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా ఉన్నారు. అయితే మాకు గౌరవప్రదంగా సీట్లు కేటాయిస్తే జత కడతామని’సీపీఐ నేతలు అన్నట్లు తెలిసింది. కాగా త్వరలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాగదీత ధోరణి వద్దని చెప్పాం: కూనంనేని ఈ విషయంపై కూనంనేని మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రేతో చర్చలు జరిగాయి. సానుకూల వాతావరణంలో మేం మాట్లాడుకున్నాం. పొత్తుల విషయంలో సాగదీత ధోరణి వద్దని స్పష్టం చేశాం. ఒకట్రెండు సార్లు చర్చలతోనే అన్నీ జరిగిపోవాలి. అంతేగానీ బీఆర్ఎస్ వలె ఒకటిస్తాం... రెండిస్తాం అన్న ధోరణితో ఉంటే అసలు చర్చలే అవసరంలేదని మధ్యవర్తితో చెప్పాం. అన్నీ సక్రమంగా జరిగితే పొత్తుకు ముందుకు వస్తాం. గౌరవ ప్రదంగా సీట్లు కేటాయించకుండా సాగదీత ధోరణితో వ్యవహరిస్తే మా దారి మేం చూసుకుంటామ’ని చెప్పామన్నారు. మరోవైపు సీపీఎం నేతలతోనూ ఠాక్రే రాయబారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నందున ఎప్పుడు చర్చలు జరుగుతాయో చూడాలి. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తుతో ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ పునరాలోచన...? బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా తన అభ్యర్థులను ప్రకటించడంతో కమ్యూనిస్టులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులను ఉపయోగించుకొని వదిలేశారని, మోసం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మరోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు వెళ్తే నష్టం జరుగుతుందన్న అంచనాకు రావడం తదితర కారణాలతో బీఆర్ఎస్ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన ఒక నేత కమ్యూనిస్టులతో మళ్లీ రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ‘జరిగిందేదో జరిగింది. మనం మళ్లీ పొత్తు పెట్టుకుందాం. తొందపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే ఇప్పటికిప్పుడు చెరో ఎమ్మెల్సీ స్థానం ఇస్తాం. అందుకోసం ప్రస్తుతమున్న ఎమ్మెల్సీలను రాజీనామా చేయిస్తాం. అసెంబ్లీ సీట్లపైనా ఒక అవగాహనకు వద్దాం’అన్నట్లు తెలిసింది. కానీ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. మరి చివరి వరకు కమ్యూనిస్టులు అదే పట్టు కొనసాగిస్తారా.. ఎన్నికల నాటికి వారి పొత్తు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.! -
నేడు హైదరాబాద్ లో టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
-
బీఆర్ఎస్కు షాక్...కాంగ్రెస్‌లోకి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్‌లో పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇరువురి మధ్య విస్త్రృతస్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పగా.. చివరగా ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా ఇరువురు నేతలు సంపూర్ణ మద్దతుతో సహకారం అందించుకోవాలని ముఖ్య నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇక కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కలుసుకున్న పాత మిత్రులు సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇరువురు ముఖ్యనేతలు కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో రాష్ట్ర ఉన్నత స్థాయి నేతల సమక్షంలో శనివారం జరిగిన భేటీలో ఇరువురి మధ్య సయోధ్య కుదిరి మళ్లీ కలసిపోనున్నట్లు తెలుస్తోంది. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మొదటి నుంచి నాగం జనార్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో నాగం టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూచుకుళ్ల ఆయన కోసం పనిచేశారు. అనంతరం 1998 సంవత్సరం వరకు నాగం వెంటే ఉండి ఆయనకు మద్దతుగా నిలిచారు.1999 ఎన్నికల సమయంలో నాగంతో విభేదించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బలపడనున్న వీరి బంధం ఎలాంటి ప్రభావం చూపనుందోననే అంశంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్కు షాక్ .. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో కలవడం తమకు ఎంతో కలసివస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండగా, ఆయన పార్టీ మారినా తమకు ఢోకా ఉండదని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండబోదని రాహుల్‌గాంధీ గతంలోనే చెప్పారని మాణిక్‌రావుఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయనీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సోమవారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సంగారెడ్డికి వచ్చిన ఠాక్రే మీడియాతో మాట్లాడారు. దళిత సీఎం అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఠాక్రే వెంట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్, నేతలు వి.హన్మంత్‌రావు, అజారుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, రోహిత్‌చౌదరి, మధుయాష్కిగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, కుసుమ్‌కుమార్ ఉన్నారు. కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక విషయమై విలేకరులు అడగగా, పారీ్టలోకి ఎవరైనా రావచ్చని, పొంగులేటి వస్తే ఆహా్వనిస్తామన్నారు. చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్ -
కాంగ్రెస్ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించా: జగ్గారెడ్డి
-
గన్ షాట్ : మాణిక్ ఎంట్రీతో టీ-కాంగ్రెస్ లో మంట చల్లారుతుందా..?
-
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువును శాసనసభ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాబట్టుకోవాలనే కసితో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బరిలోకి దిగిన 26 మంది అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. గెలిచే సత్తా ఉన్నప్పటికీ నలుగురు మంత్రులు గెలవలేకపోయారు. దీంతో ఆ నలుగురు మంత్రులను పదవుల్లోంచి తొలగించి పార్టీ పనులు చూసుకునే బాధ్యతలు అప్పగించాలని సోనియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారి స్థానంలో ఒకరు పాత, మూడు కొత్త, యువముఖాలకు అవకాశమివ్వాలని ఆమె యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదివరకే మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మార్పులు చేయడం ప్రారంభించింది. తమ కోటాలో ఖాళీగా ఉన్న పదవులను భర్తి చేయడం మొదలుపెట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచి ఉరుకులు పరుగులు ప్రారంభించింది. అయితే వేటు పడనున్న ఆ నలుగురు మంత్రులు ఎవరు..?, వారి స్థానంలో నియమితులయ్యే కొత్త ముఖాలు ఎవరివి...? అనేది గోప్యంగా ఉంచారు. దీంతో పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. సోనియాను కలసిన చవాన్, మాణిక్‌రావ్ న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని శుక్రవారం కలిశారు. త్వరలో విధాన మండలికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయమై వీరిరువురు సోనియాతో సమావేశమయ్యారని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ తదితర సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పారు. పుణే, అమరావతిలో ఉపాధ్యాయుల నియోజకవర్గం, నాగపూర్‌లో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఈ ఉప-ఎన్నికల్లో పోటీ చేస్తోంది. -
ప్రచారమస్తు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. ఏప్రిల్ పదిన తొలి దశ ఎన్నికలు జరగనున్న విదర్భ ప్రాంతంలో రాజకీయ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మాటల యుద్ధంతో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే...ఓటర్ల నాడీ పట్టుకునేలా అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. తమకు అధికారం అప్పగిస్తే సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని ఓటర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య (కాంగ్రెస్, ఎన్సీపీ) కూటమి అవినీతి కూపంలోకి మునిగిపోయిందని, అనేక కుంభకోణాల్లో ఆ పార్టీ నేతల ప్రమేయముందని, అలాంటి వారికి మళ్లీ అధికారం అప్పగిస్తారా అని శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ షేత్కారీలతో కూడిన మహా కూటమి ఓటర్లను ఆలోచింప చేసేలా చేస్తోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే మహా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వివరిస్తోంది. విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు కృషి చేస్తామని, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు నిర్మించి వేల ఎకరాల్లో పొలాలకు నీరందిస్తామని, అవినీతి రహిత పాలన సాగిస్తామని, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఓటర్ల ముందు ఏకరువు పెడుతోంది. ఇప్పటికే మహా కూటమి తరఫున బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే, బీజేపీ నేతలు గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కారీలు ప్రచారం నిర్వహించారు. మరోవైపు డీఎఫ్ కూటమి కూడా విదర్భలో ఎన్నికల ప్రచారం స్పీడ్‌ను పెంచింది. పొత్తులో భాగంగా విదర్భ ప్రాంతంలో ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఐదింటిలో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అధికారమే పరమావధిగా కాషాయ కూటమి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రచారంలో ఆరోపిస్తోంది. తమ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూనే, మళ్లీ అవకాశమిస్తే విదర్భ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తామని అంటోంది. ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న మహా కూటమికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతోంది. తమను గెలిపిస్తే అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరాయంగా కృషి చేస్తామని చెబుతోంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ప్రచారంలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందూ దొందేనని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. అన్నివిధాలా న్యాయం చేసే అభ్యర్థులను గెలిపించాలని, ఆప్‌కి అవకాశమిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామనే భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వీటితో పాటు బరిలో ఉన్న చిన్నాచితక పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బరిలో 361 మంది... విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ స్థానాల్లో 361 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాగపూర్ స్థానం నుంచి 45 మంది, భండారా-గోండియా స్థానం నుంచి 44 మంది, యావత్మాల్-వాషీమ్ స్థానం నుంచి 40 మంది, అమరావతి నుంచి 30 మంది, రాంటెక్ నుంచి 27 మంది, బుల్ధానా, వార్ధా, చంద్రపూర్ ఒక్కో స్థానం నుంచి 21 మంది, గడ్చిరోలి-చిమూర్ నుంచి 13 మంది, అకోలా నుంచి తొమ్మిది మంది పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. వినూత్న పద్ధతుల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 17న రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోనూ ఆయా పార్టీల నేతల ప్రచారం మొదలైంది. ఉత్తర, పశ్చిమహారాష్ట్రతోపాటు మరాఠ్వాడా ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతలు ఓటర్లను తమవైపుకు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షోలు, బహిరంగ సభలు, చౌరస్తా సభలు, బైక్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ, ఇంటింటికీ ప్రచారాలు చేస్తున్నారు. 266 మంది స్టార్ క్యాంపెనర్లు... ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అనేకమంది స్టార్ క్యాంపెనర్లు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల కమిషన్‌కు పార్టీలు అందించిన వివరాల మేరకు ఈసారి మొత్తం 266 మంది స్టార్ క్యాంపెనర్లు తమ తమ పార్టీల కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున 40 మంది, ఎన్సీపీకి చెందిన 37 మంది, బీజేపీ తరఫున 40 మంది, శివసేనకు చెందిన 34, ఎమ్మెన్నెస్ తరఫున 27 మంది స్టార్ క్యాంపెనర్లు ఉన్నారు. అయితే వీరిలో అనేకమంది గుర్తింపులేని వారుకూడా ఉన్నట్టు తెలిసింది. మిలింద్‌ను గెలిపించండి: మధుయాష్కి నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముంబైలో కాంగ్రెస్ అభ్యర్ధి మిలింద్ దేవరా తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ముంబైలోని వివిధ తెలుగు సంఘాల ప్రజలతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి వర్లిలోని జాగృతి స్పోర్ట్స్ క్లబ్, పద్మశాలి సమాజ సుధారక మండలితోపాటు వివిధ సంఘాలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి మిలింద్ దేవరాను గెలిపిస్తే తెలుగు సమాజం కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మిస్తామని మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంస్థ ట్రస్టీ చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు వేముల మనోహర్, సిద్ధివినాయక మందిరం ట్రస్టీ ఏక్నాథ్ సంగం తదితరులు పాల్గొన్నారు. 19 స్థానాల్లో 352 మంది పోటీ సాక్షి, ముంబై: వచ్చే నెల 19న రెండో విడత ఎన్నికలు జరిగే పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలతోపాటు మరాఠ్వాడాలోని 19 లోక్‌సభ స్థానాలకు 352 మంది బరిలో ఉన్నారు. వీరిలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నేత గోపీనాథ్ ముండే, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఉన్నారు. ముండే పోటీ చేస్తున్న బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 39 మంది, బారామతి లోక్‌సభలో అత్యల్పంగా తొమ్మిది మంది అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. హింగోలిలో 23, నాందేడ్‌లో 23, పర్భణీలో 17, మావల్లో 19, పుణేలో 29, బారామతిలో తొమ్మిది, శిరూర్‌లో 14, అహ్మద్‌నగర్‌లో 13, షిర్డీలో 14, ఉస్మానాబాద్‌లో 27, లాతూర్‌లో 18, షోలాపూర్‌లో 16, మాడాలో 16, సాం గ్లీలో 17, సతారాలో 12, రత్నగిరి-సింధుదుర్గాలో 10, కొల్హా పూర్లో 15, హతకణంగలేలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను ఈసీ కేటాయించింది. -
‘12 లక్షల హెక్టార్లలో పంట నష్టం’
నాగపూర్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల 12 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ముంబైలో గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పరిస్థితిపై సమీక్షించి తీసుకోవల్సిన పునరావాల్సిన చర్యల గురించి చర్చిస్తామని చెప్పారు. నాగపూర్ జిల్లా నార్కేడ్ తాలూకాలోని మోహ్‌గావ్ భటడేలో ధ్వంసమైన గోధుమ, ఆరెంజ్ తోటలను సందర్శించి రైతులను పరామర్శించారు. ఆయన వెంట రాష్ర్ట పునరావాస మంత్రి పతంగ్‌రావ్ కదమ్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, ఆర్థిక సహాయ మంత్రి రాజేంద్ర ములాక్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నాగపూర్ డివిజిన్లో ఆరుగురు మృతి చెందగా, 47 పశువుల మృతి చెందాయని జిల్లా యంత్రాంగ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 10,261 ఇళ్లు ధ్వంసమయ్యాని తెలిపింది. నాగపూర్ జిల్లాలో కాంప్టీ, హింగానా, సావ్నర్, కటోల్, కలమేశ్వర్, నార్కేడ్, రాంటెక్, పర్సివోని, మౌడా, భివపూర్, కుహిలలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. చంద్రపూర్ జిల్లాలోని భండారా, పవోని, సకోలి, లకంద్పూర్, గోరేగావ్, గోండియా, వరోరాలలోనూ పంటలు, తోటలు నాశనమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలావుండగా విదర్భలోని యావత్మల్, వాషీమ్ జిల్లాలోనూ సీఎం చవాన్ పర్యటించారు. పంటనష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ధాటికి 28 మంది మృతి గత పది రోజుల నుంచి రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాల వల్ల 28 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ అకాల వర్షాల ప్రభావం 29 జిల్లాలపై ఉందన్నారు. 18,200కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. తొమ్మిది వేలకు పైగా పశువులు మృతి చెందాయని తెలిపారు. నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం నాసిక్: అకాల వర్షాలతో పాటు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లిగడ్డ, గోధుమ, దానిమ్మ తోటల నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. నిపడ్, చంద్వాడ్, దేవ్లా, సతానా, మాలేగావ్‌లో ఈ బృందం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలి పాయి. ఆ తర్వాత ధులేకు వెళుతుందన్నారు.