సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువును శాసనసభ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాబట్టుకోవాలనే కసితో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బరిలోకి దిగిన 26 మంది అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. గెలిచే సత్తా ఉన్నప్పటికీ నలుగురు మంత్రులు గెలవలేకపోయారు. దీంతో ఆ నలుగురు మంత్రులను పదవుల్లోంచి తొలగించి పార్టీ పనులు చూసుకునే బాధ్యతలు అప్పగించాలని సోనియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వారి స్థానంలో ఒకరు పాత, మూడు కొత్త, యువముఖాలకు అవకాశమివ్వాలని ఆమె యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదివరకే మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మార్పులు చేయడం ప్రారంభించింది. తమ కోటాలో ఖాళీగా ఉన్న పదవులను భర్తి చేయడం మొదలుపెట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచి ఉరుకులు పరుగులు ప్రారంభించింది. అయితే వేటు పడనున్న ఆ నలుగురు మంత్రులు ఎవరు..?, వారి స్థానంలో నియమితులయ్యే కొత్త ముఖాలు ఎవరివి...? అనేది గోప్యంగా ఉంచారు. దీంతో పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
సోనియాను కలసిన చవాన్, మాణిక్‌రావ్
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని శుక్రవారం కలిశారు. త్వరలో విధాన మండలికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయమై వీరిరువురు సోనియాతో సమావేశమయ్యారని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ తదితర సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పారు. పుణే, అమరావతిలో ఉపాధ్యాయుల నియోజకవర్గం, నాగపూర్‌లో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఈ ఉప-ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం
Published Fri, May 30 2014 11:17 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement