సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌తో బ్రేకప్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాయబారం మొదలుపెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఓ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు ఉండటం, ఇతర జిల్లాల్లోనూ అనేక చోట్ల ప్రభావితం చేయగలిగే పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు సిద్ధం కావాలని యోచిస్తోంది.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే కమ్యూనిస్టులతో మధ్యవర్తిత్వం మొదలుపెట్టారు.హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. ‘బీజేపీని ఓడించాలన్న కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధం.
అందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా ఉన్నారు. అయితే మాకు గౌరవప్రదంగా సీట్లు కేటాయిస్తే జత కడతామని’సీపీఐ నేతలు అన్నట్లు తెలిసింది. కాగా త్వరలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
సాగదీత ధోరణి వద్దని చెప్పాం: కూనంనేని
ఈ విషయంపై కూనంనేని మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రేతో చర్చలు జరిగాయి. సానుకూల వాతావరణంలో మేం మాట్లాడుకున్నాం. పొత్తుల విషయంలో సాగదీత ధోరణి వద్దని స్పష్టం చేశాం. ఒకట్రెండు సార్లు చర్చలతోనే అన్నీ జరిగిపోవాలి. అంతేగానీ బీఆర్‌ఎస్ వలె ఒకటిస్తాం... రెండిస్తాం అన్న ధోరణితో ఉంటే అసలు చర్చలే అవసరంలేదని మధ్యవర్తితో చెప్పాం.
అన్నీ సక్రమంగా జరిగితే పొత్తుకు ముందుకు వస్తాం. గౌరవ ప్రదంగా సీట్లు కేటాయించకుండా సాగదీత ధోరణితో వ్యవహరిస్తే మా దారి మేం చూసుకుంటామ’ని చెప్పామన్నారు. మరోవైపు సీపీఎం నేతలతోనూ ఠాక్రే రాయబారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నందున ఎప్పుడు చర్చలు జరుగుతాయో చూడాలి. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తుతో ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ పునరాలోచన...?
బీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్షంగా తన అభ్యర్థులను ప్రకటించడంతో కమ్యూనిస్టులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులను ఉపయోగించుకొని వదిలేశారని, మోసం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మరోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు వెళ్తే నష్టం జరుగుతుందన్న అంచనాకు రావడం తదితర కారణాలతో బీఆర్‌ఎస్ పునరాలోచనలో పడినట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక నేత కమ్యూనిస్టులతో మళ్లీ రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ‘జరిగిందేదో జరిగింది. మనం మళ్లీ పొత్తు పెట్టుకుందాం. తొందపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే ఇప్పటికిప్పుడు చెరో ఎమ్మెల్సీ స్థానం ఇస్తాం. అందుకోసం ప్రస్తుతమున్న ఎమ్మెల్సీలను రాజీనామా చేయిస్తాం. అసెంబ్లీ సీట్లపైనా ఒక అవగాహనకు వద్దాం’అన్నట్లు తెలిసింది. కానీ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. మరి చివరి వరకు కమ్యూనిస్టులు అదే పట్టు కొనసాగిస్తారా.. ఎన్నికల నాటికి వారి పొత్తు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.!
Comments
Please login to add a commentAdd a comment