సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్ చిత్రంలో షబ్బీర్ అలీ తదితరులు
అధికార పార్టీలోకి ప్రారంభమైన చేరికలు
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండానే కండువా మార్పు
ఆపరేషన్ ఆకర్‡్ష మరింత పదునెక్కే అవకాశం ఉందనే చర్చ
ఆసక్తి రేకెత్తిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
26 మంది టచ్‌లో ఉన్నారంటున్న కాంగ్రెస్ వర్గాలు
ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు చేరిక... తాజాగా మరో ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేలు పార్టీ మారడం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీకి గానీ, శాసనసభ్యత్వానికి గానీ రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇక నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.
బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్‡్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు.
టచ్‌లో 26 మంది?
ఇటీవల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి.
నాటి బీఆర్‌ఎస్ తరహాలోనే!
ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. పార్టీ మారిన వారిని ఉరి తీయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు మాట్లాడుతూ ‘నాడు కేసీఆర్ సూత్రాన్నే మేం పాటిస్తున్నాం. మా కోట గోడలను పదిలం చేసుకుంటున్నాం. బలంగా చుట్టూ కంచె వేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కొందరు, మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని మరికొందరు చేస్తున్న వ్యాఖ్య ల వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే. అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌లకు ఫిరాయింపుల రాజకీయం అలవాటే. మా జాగ్రత్తలో మేం ఉండకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయం చేస్తున్నారు. వాళ్ల శాసనసభాపక్షం మా పార్టీలో విలీనం అవు తుందేమో?’అని వ్యాఖ్యానించడం గమనార్హం.
సీఎం, మున్షీ సమక్షంలో చేరికలు
బీఆర్‌ఎస్‌కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది.
కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు: రంజిత్‌రెడ్డి
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రంజిత్‌రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి ‘ఎక్స్’లో తెలిపారు. ఇన్ని రోజులు చేవెళ్ల ఎంపీగా తనకు సేవలు చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment