సాక్షి, ముంబై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. ఏప్రిల్ పదిన తొలి దశ ఎన్నికలు జరగనున్న విదర్భ ప్రాంతంలో రాజకీయ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మాటల యుద్ధంతో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే...ఓటర్ల నాడీ పట్టుకునేలా అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. తమకు అధికారం అప్పగిస్తే సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని ఓటర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య (కాంగ్రెస్, ఎన్సీపీ) కూటమి అవినీతి కూపంలోకి మునిగిపోయిందని, అనేక కుంభకోణాల్లో ఆ పార్టీ నేతల ప్రమేయముందని, అలాంటి వారికి మళ్లీ అధికారం అప్పగిస్తారా అని శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాన్ షేత్కారీలతో కూడిన మహా కూటమి ఓటర్లను ఆలోచింప చేసేలా చేస్తోంది.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే మహా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వివరిస్తోంది. విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు కృషి చేస్తామని, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు నిర్మించి వేల ఎకరాల్లో పొలాలకు నీరందిస్తామని, అవినీతి రహిత పాలన సాగిస్తామని, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఓటర్ల ముందు ఏకరువు పెడుతోంది. ఇప్పటికే మహా కూటమి తరఫున బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆర్‌పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే, బీజేపీ నేతలు గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కారీలు ప్రచారం నిర్వహించారు.
మరోవైపు డీఎఫ్ కూటమి కూడా విదర్భలో ఎన్నికల ప్రచారం స్పీడ్‌ను పెంచింది. పొత్తులో భాగంగా విదర్భ ప్రాంతంలో ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఐదింటిలో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అధికారమే పరమావధిగా కాషాయ కూటమి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రచారంలో ఆరోపిస్తోంది. తమ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూనే, మళ్లీ అవకాశమిస్తే విదర్భ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తామని అంటోంది. ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న మహా కూటమికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతోంది. తమను గెలిపిస్తే అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరాయంగా కృషి చేస్తామని చెబుతోంది.
ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ప్రచారంలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందూ దొందేనని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. అన్నివిధాలా న్యాయం చేసే అభ్యర్థులను గెలిపించాలని, ఆప్‌కి అవకాశమిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామనే భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వీటితో పాటు బరిలో ఉన్న చిన్నాచితక పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
బరిలో 361 మంది...
విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ స్థానాల్లో 361 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాగపూర్ స్థానం నుంచి 45 మంది, భండారా-గోండియా స్థానం నుంచి 44 మంది, యావత్మాల్-వాషీమ్ స్థానం నుంచి 40 మంది, అమరావతి నుంచి 30 మంది, రాంటెక్ నుంచి 27 మంది, బుల్ధానా, వార్ధా, చంద్రపూర్ ఒక్కో స్థానం నుంచి 21 మంది, గడ్చిరోలి-చిమూర్ నుంచి 13 మంది, అకోలా నుంచి తొమ్మిది మంది పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. వినూత్న పద్ధతుల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 17న రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోనూ ఆయా పార్టీల నేతల ప్రచారం మొదలైంది. ఉత్తర, పశ్చిమహారాష్ట్రతోపాటు మరాఠ్వాడా ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతలు ఓటర్లను తమవైపుకు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షోలు, బహిరంగ సభలు, చౌరస్తా సభలు, బైక్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ, ఇంటింటికీ ప్రచారాలు చేస్తున్నారు.
266 మంది స్టార్ క్యాంపెనర్‌లు...
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అనేకమంది స్టార్ క్యాంపెనర్‌లు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల కమిషన్‌కు పార్టీలు అందించిన వివరాల మేరకు ఈసారి మొత్తం 266 మంది స్టార్ క్యాంపెనర్‌లు తమ తమ పార్టీల కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున 40 మంది, ఎన్సీపీకి చెందిన 37 మంది, బీజేపీ తరఫున 40 మంది, శివసేనకు చెందిన 34, ఎమ్మెన్నెస్ తరఫున 27 మంది స్టార్ క్యాంపెనర్‌లు ఉన్నారు. అయితే వీరిలో అనేకమంది గుర్తింపులేని వారుకూడా ఉన్నట్టు తెలిసింది.
మిలింద్‌ను గెలిపించండి: మధుయాష్కి
నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముంబైలో కాంగ్రెస్ అభ్యర్ధి మిలింద్ దేవరా తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ముంబైలోని వివిధ తెలుగు సంఘాల ప్రజలతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి వర్లిలోని జాగృతి స్పోర్ట్స్ క్లబ్, పద్మశాలి సమాజ సుధారక మండలితోపాటు వివిధ సంఘాలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి మిలింద్ దేవరాను గెలిపిస్తే తెలుగు సమాజం కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మిస్తామని మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంస్థ ట్రస్టీ చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు వేముల మనోహర్, సిద్ధివినాయక మందిరం ట్రస్టీ ఏక్‌నాథ్ సంగం తదితరులు పాల్గొన్నారు.
19 స్థానాల్లో 352 మంది పోటీ
సాక్షి, ముంబై: వచ్చే నెల 19న రెండో విడత ఎన్నికలు జరిగే పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలతోపాటు మరాఠ్వాడాలోని 19 లోక్‌సభ స్థానాలకు 352 మంది బరిలో ఉన్నారు. వీరిలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నేత గోపీనాథ్ ముండే, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఉన్నారు. ముండే పోటీ చేస్తున్న బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 39 మంది, బారామతి లోక్‌సభలో అత్యల్పంగా తొమ్మిది మంది అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. హింగోలిలో 23, నాందేడ్‌లో 23, పర్భణీలో 17, మావల్‌లో 19, పుణేలో 29, బారామతిలో తొమ్మిది, శిరూర్‌లో 14, అహ్మద్‌నగర్‌లో 13, షిర్డీలో 14, ఉస్మానాబాద్‌లో 27, లాతూర్‌లో 18, షోలాపూర్‌లో 16, మాడాలో 16, సాం గ్లీలో 17, సతారాలో 12, రత్నగిరి-సింధుదుర్గాలో 10, కొల్హా పూర్‌లో 15, హతకణంగలేలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను ఈసీ కేటాయించింది.
ప్రచారమస్తు
Published Mon, Mar 31 2014 11:18 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement