అదానీకి ‘వడోదర'౦త భూసంతర్పణ! | Narendra Modi has given land equal to Vadodara to Adani: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

అదానీకి ‘వడోదర'౦త భూసంతర్పణ!

Published Sun, Apr 13 2014 1:22 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

అదానీకి ‘వడోదర'౦త భూసంతర్పణ! - Sakshi

అదానీకి ‘వడోదర'౦త భూసంతర్పణ!

మోడీ భూకేటాయింపులపై రాహుల్ ధ్వజం
 300 కోట్లకే 149 చ.కి.మీ భూమి ధారాదత్తం
 167 కి.మీ పొడవైన తీర ప్రాంతమూ అప్పగింత
 అమేథీ స్థానానికి రాహుల్ గాంధీ నామినేషన్
 
 న్యూఢిల్లీ: గుజరాత్ అభివృద్ధి పేరిట నరేంద్ర మోడీ కొద్ది మంది పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సన్నిహితుడైన ఓ పారిశ్రామికవేత్తకు వడోదర పట్టణమంత భూమిని మోడీ కారు చౌకగా కట్టబెట్టారని పరోక్షంగా అదానీ గ్రూప్ పేరును ప్రస్తావిస్తూ దుయ్యబట్టారు.
 
 మోడీ అభివృద్ధి ప్రచారమంతా బూటకమని శనివారం రాత్రి ఆజ్‌తక్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ విరుచుకుపడ్డారు. ‘‘149 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వడోదర పట్టణానికి సమానమైన భూమిని మోడీ ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లకే ఓ వ్యక్తికి అప్పగించింది. అలాగే 167 కిలోమీటర్ల పొడవుండే ముంబై సముద్ర తీరానికి సమానమైన తీర ప్రాంతాన్ని కూడా మోడీ సర్కారు అతనికే కట్టబెట్టింది. గుజరాత్ అభివృద్ధి సాధించిందంటే అందుకు చిన్న పరిశ్రమలే కారణం. అమూల్ వంటి క్షీర విప్లవాలే గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి వెనకున్న బలం. కానీ మోడీ చెబుతున్న గుజరాత్ అభివృద్ధి ఒక పారిశ్రామికవేత్తకే మేలు చేకూరుస్తోంది. ఆ పారిశ్రామికవేత్త టర్నోవర్ రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెరిగిపోయింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
 
 వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు
ఎన్నికల ప్రచారంలో మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసినట్లు వచ్చిన విమర్శలపై రాహుల్ స్పందిస్తూ తాను వ్యక్తిగత విమర్శలు చేయట్లేదన్నారు. అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పారు. ‘‘మోడీని వ్యక్తిగా నేను విమర్శించట్లేదు. ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతం దేశ ప్రజలను ఒకరిపై ఒకరు ఉసిగొల్పేలా ఉంది. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం. ఆ సిద్ధాంతంపైనే నేను పోరాడుతున్నా’’ అని రాహుల్ తెలిపారు.
 
 రాహుల్ రోడ్‌షో
 అమేథీ: రాహుల్ గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ తన కుటుంబ సభ్యుల సమేతంగా గౌరీగంజ్‌లోని కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని అమేధీ నియోజకవర్గానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
 
 ఎస్‌యూవీ వాహనంపై ఆసీనుడైన రాహుల్‌కు కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే మూడు కిలోమీటర్ల పొడవునా రోడ్డుకిరువైపులా పార్టీ కార్యకర్తలు నిల్చుని స్వాగతం పలికారు. శనివారమే నామినేషన్ల ప్రక్రియ మొదలైన అమేధీ నియోజకవర్గానికి మే 7న పోలింగ్ జరగనుంది.
 
 43 ఏళ్ల రాహుల్ ఈ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు.. రాహుల్, ఆయన తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ, ఆమె భర్త రాబర్ట్‌వాద్రాలు పొరుగున ఉన్న సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో 42 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి అమేధీ చేరుకున్నారు.
 
 సుల్తాన్‌పూర్‌లో రాహుల్ దాయాది అయిన వరుణ్‌గాంధీ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. తన చిన్నమ్మ మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణగాంధీలు పోటీచేసే స్థానాల్లో తాను ప్రచారం చేయకుండా ఉండే సంప్రదాయాన్ని రాహుల్ ఈసారి పక్కనపెట్టారు.
 
రాహుల్ ఆస్తులు రూ. 10 కోట్లు
రాహుల్‌గాంధీ తన స్థిరాస్తులు తగ్గినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే.. ఉన్న ఆస్తుల విలువ ఐదేళ్లలో రెట్టింపయినట్లు తెలిపారు.
 
 2009 ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 4.7 కోట్లుగా పేర్కొన్న స్థలాల విలువ ఇప్పుడు 9.4 కోట్లకు చేరినట్లు వివరించారు. ఐదేళ్ల కిందట తన పేరు మీద ఒక మాల్‌లో ఉన్న రెండు షాపులను విక్రయించానని, హర్యానాలో ఒక వ్యవసాయ స్థలం నుంచి వైదొలగానని రాహుల్ తెలిపారు.
 
 రాహుల్‌కు సొంతంగా కారు లేదు. 2.87 లక్షల విలువైన, 333 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
 
 2012-13లో ఆదాయం రూ. 92.46 లక్షలుగా చూపారు.
 
 ఈ ఏడాది మార్చి 31 నాటికి రాహుల్ వద్ద రూ. 35,000 నగదు ఉంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 9.50 లక్షలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement