ఝుంఝునులో సభావేదికపైన సచిన్ పైలట్ చెబుతున్నది వింటున్న రాహుల్ గాంధీ
ఝుంఝును(రాజస్థాన్):దేశానికి కాపలాదారు (చౌకీదార్)గా ఉంటానంటున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు సంధించారు. కొన్నిసార్లు కాపలాదారు కూడా దొంగతనానికి పాల్పడతాడని, అందుకే దేశం తాళం చెవులను కేవలం ఒకే ఒక్కరి చేతుల్లో పెట్టకూడదని అన్నారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
మోడీ తాను దేశానికి కాపలాదారు కావాలనుకుంటున్నారు. కోట్లాది ప్రజలు దేశానికి కాపలాదారులు కావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. దేశం తాళం చెవులను కోట్లాది ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. అదే కాంగ్రెస్కు, బీజేపీకి మధ్య ఉన్న పెద్ద తేడా అన్నారు. జనానికి ఒక్క చౌకీదార్ అక్కర్లేదు. ఇప్పటికే పెద్ద చౌకీదార్లు చాలా మంది ఉన్నారు. వారిని తప్పించాల్సిన అవసరముందని అన్నారు. అందుకే తాము ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాలతో సాధికారత కల్పించామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను బిజెపి కాపికొట్టిందని విమర్శించారు. రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ కూడా సభలో పాల్గొన్నారు.