బీజేపీ మోడీనే నమ్ముకుంది
కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ఎద్దేవా
తిరువనంతపురం: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘బీజేపీ ఇప్పటి వరకూ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించలేదు. మీరు ఏం కోరుకుంటున్నారో వారికి అవసరం లేదు. వారు మీకు గౌరవం ఇవ్వరు. ఒకే వ్యక్తి అన్నిటికీ జవాబు అని వారు నమ్ముతున్నారు.
ఆయన కూడా ఎవరి మాటా వినిపించుకునే స్థితిలో లేరు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని ఆయన భావిస్తుంటారు. అయితే ప్రజలు వీరిని నమ్మే స్థితిలో లేరు’’ అని కేరళలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం రాహుల్‌గాంధీ కేరళలో సుడిగాలి పర్యటన చేసి ర్యాలీలు.. సభల్లో పాల్గొన్నారు. బీజేపీ ఆర్థిక, సామాజిక విధానాలను కూడా ఆయన తప్పుబట్టారు. భారత్ వెలిగిపోతోందని ఐదారు రంగాలకే బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందని, అన్ని వనరులనూ వారికే కేటాయించిందని ఆరోపించారు. బీజేపీ తీరు పేదల నుంచి తీసుకుని పెద్దలకు పెట్టిన చందంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వామపక్షాల తీరునూ ఆయన తప్పుపట్టారు. కమ్యూనిస్టులు నిజాయితీనీ, సమానత్వాన్నీ కోరుకుంటారని, అయితే అందుకోసం అభివృద్ధిని త్యాగం చేసి అందరినీ పేదరికంలోనే మగ్గేలా చేస్తున్నారని చెప్పారు.