కేకు కట్ చేసి... వివాదంలో చిక్కుకున్నాడు
ముంబై : మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి అన్నీ తన జన్మదినం సందర్బంగా రాష్ట్ర మ్యాప్ ఆకారంలో ఉన్న కేకును కట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 66వ జన్మదినం సందర్భంగా మంగళవారం అర్థరాత్రి విదర్భ ప్రాంతంలో బాంద్రాలోని శ్రీహరి అన్నీ తన నివాసంలో ఈ మ్యాప్ ఉన్న కేకును నాలుగు భాగాలుగా కట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అవి రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ సృష్టిస్తున్నాయి.
కాగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికీ ఆయన కిందటి నెలలో రాజీనామా చేశారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న శ్రీహరి ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు.
అయితే శ్రీహరి కేకు కట్ చేయడంపై పలువురు రాజకీయ ప్రముఖులు ఈ విధంగా స్పందించారు. శ్రీహరి ఈ రోజు జరుపుకున్న జన్మదిన వేడుకలు చాలా కాలం గుర్తుంటాయని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్ర మ్యాప్ ఆకారంలో ఉన్న కేక్ కట్ చేయటంలో తప్పేమీ లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు శ్రీహరి అన్నీ సన్నిహితుడిగా పేరుంది.