మూడు నెలలు ... 200 మంది ఆత్మహత్య
ఔరంగబాద్: ఎండలు మండిపోతున్నాయి. వానలు... పడాల్సిన సమయంలో పడటం లేదు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంట పండితేనే తమ బతుకు పండుతుందని రైతుకు ఓ చిన్న ఆశ. ఆ ఆశతోనే బ్యాంకు లోన్ ఇస్తే వాటి ద్వారా బోర్లు వేసుకుంటే... కష్టాలు తీరతాయనుకున్నారు. ఆ క్రమంలో లోన్లు కోసం బ్యాంకు మెట్లు ఎక్కారు. లోన్ తీసుకుని బోర్లు వేశారు. బోర్లలో చుక్క నీరు పడలేదు... అలాగే వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోయాయి.
చేసిన అప్పులు తీర్చాలంటూ రైతులపై బ్యాంకర్లు ఒత్తిడి... రోజురోజూకు పెరుగుతుంది. అప్పు తీర్చేందుకు పైసా కూడా లేకపోవడంతో మహారాష్ట్ర మరట్వాడా ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల రైతులు మరణమే శరణ్యమని భావించారు. దాంతో ఒకరు ఇద్దరు కాదు... ఏకంగా 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అది మూడు నెలల కాలవ్యవధిలోనే. గతేడాది ఇదే ప్రాంతంలో మొత్తం 510 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.