ప్రతీకాత్మక చిత్రం
ముంబై: కరోనా సంక్షోభంలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. లాక్‌డౌన్ సమయంలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో సగటున రోజుకు ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. లాక్‌డౌన్ సమయంలో(మార్చి-ఏప్రిల్) 109 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 231 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మార్చిలో 73, ఏప్రిల్‌లో 36 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో దాదాపు 1.87 కోట్ల జనాభా ఉండగా, అన్ని జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పుడున్న కష్టాలకు తోడు కోవిడ్-19 సంక్షోభం తోడుకావడంతో రైతుల బాధలు అధికమయ్యాయని షెట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వత్ అన్నారు. వ్యవసాయ రంగంపై కరోనా సంక్షోభం ప్రభావం చాలా రోజుల పాటు కొనసాగే అవకాశముందని, రైతులకు మరిన్ని కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ‘వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ లేదు. లాక్‌డౌన్ సమయంలో రైతులు తమ ఫలసాయాన్ని 10 శాతం కూడా అమ్మలేకపోయారు. విత్తనాలు విత్తడానికి, వారి కుటుంబాలను చూసుకోవడానికి రైతుల వద్ద డబ్బు లేద’ని ఆయన వివరించారు.
జాతీయ మానవ హక్కుల సంఘానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం 2011 జనవరి నుంచి 2014 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 6,268 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఈ సంఖ్య దాదాపు రెట్టింపు(11,995) ఆత్మహత్యలు 2015-18 మధ్యకాలంలో నమోదు కావడం మహారాష్ట్రలో రైతుల దుస్థితికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. (అదే వరస..ఆగని కరోనా కేసులు..)
Comments
Please login to add a commentAdd a comment