సాక్షి, ముంబై: పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, కొంకణ్‌లోని 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్ని రోజులు రాజకీయ నేతల ప్రసంగాలను విన్న ఓటర్లు నేడు తమ ఓటుతో అభ్యర్థుల తలరాతలు రాసేందుకు సిద్ధమయ్యారు. 36,879 పొలింగ్ కేంద్రాల్లో సుమారు 3.25 కోట్ల మంది తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందే చేసిపెట్టింది.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ఎండలో వచ్చి ఓటువేసే వారికి పొలింగ్ కేంద్రం వద్ద మంచినీరు అందుబాటులో ఉంచింది. వృద్ధులు, వికలాంగులకు తగిన ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు మొహరించారు. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే, మాజీ సీఎం అశోక్ చవాన్, సుప్రీయా సూలే , విజయ్ సింహ్ మోహితే పాటిల్, పద్మసింహ్ పాటిల్, నీలేష్ రాణే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ముఖాముఖి పోటీ...
రెండో దశలో ఎన్నికలు జరుగనున్న 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ డీఎఫ్ కూటమి, మహాకూటమిల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ఎన్నికల ప్రచారం చివరిరోజు వరకు కాంగ్రెస్ కూటమి ప్రచారం కోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రచారం చేశారు.
మహాకూటమి కోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత గోపీనాథ్ ముండే తదితరులు ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశంలోనే తొలిసారిగా బీజేపీ అత్యాధునిక సాంకేతిక పరిఙ/ా్ఞనాన్ని వినియోగించుకుంది. మోడీ కోసం త్రీడి సభలను ఏర్పాటు చేసింది. మోడీ వేరే ప్రాంతంలో మాట్లాడుతున్నప్పటికీ త్రీడీ టెక్నాలజీ కారణంగా మనముందే ఉన్నట్టు, మనవైపే చూస్తూ మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఇలా తొలిసారిగా ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ సభకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.
అందరి దృష్టి సింధుదుర్గావైపు...
రెండో దశలో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ నియోజకవర్గంవైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే, శివసేన అభ్యర్థి వినాయక్ రావుత్‌ల మధ్య గట్టిపోటీ కన్పిస్తోంది. సింధుదుర్గాలో రాణే ప్రభావం ఉన్నా గత కొంతకాలంగా మారిన రాజకీయ సమీకరణాలు రాణే వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు కేసకర్ రాణేకు ప్రచారం చేయడానికి నిరాకరించి అధిష్టానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పార్టీకి రాజీనామా చేశారు.
ఆ తర్వాత కేసకర్ మద్దతుదారులు శివసేనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, అహ్మద్‌నగర్‌లోనూ ఈసారి తీవ్ర పోటీనే నెలకొంది. గత ఎన్నికల్లో సుమారు 47 వేల ఓట్ల మెజార్టీతో ఎన్‌సీపీ అభ్యర్థి శివాజీ భానుదాస్ కర్దిలేపై విజయం సాధించిన దిలీప్ కుమార్ ఈసారి విజయం కోసం చెమటోడుస్తున్నారు. అయితే ఈసారి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాజీవ్ రాజలేను ఎన్‌సీపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. షిర్డీలో శివసేన అభ్యర్థిగా సదాశివ్ లోకాండే, కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ బావ్‌సాహెబ్ వాక్‌చౌరే మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
నేడే రెండో దశ
Published Wed, Apr 16 2014 10:19 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement