న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు కలవటం లేదని, వారితో మాట్లాడలేకపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో మొత్తం మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆప్ నేత దిలీప్ పాండే. అయితే, 40 మంది ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
‘ఎమ్మెల్యేలందరితో టచ్‌లో ఉన్నాం. బుధవారమే అందరికి సందేశాలు పంపించాం. ఫోన్లు కలవని వారికి సైతం సందేశాలు చేరుతాయి. మీటింగ్‌కు ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. 40 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది’ అని పేర్కొన్నారు దిలీప్ పాండే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, పలువురు ఎమ్మెల్యేల ఆచూకీ లభించకపోవటంతో ఆప్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బీజేపీలో చేరే ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు కాషాయపార్టీ ఆఫర్ చేసిందని బుధవారం ఆరోపించారు సౌరభ్ భరద్వాజ్. అంతకు ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం బీజేపీపై ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటే బీజేపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం
Comments
Please login to add a commentAdd a comment