భోపాల్/సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కీలకనేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరుకు మకాం మార్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను వలలో వేసుకుంటోందంటూ ఇటీవల కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగివచ్చి సర్కారుకు మద్దతు పలకడం తెలిసిందే.
అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు.
దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి.
రిసార్టులో మకాం
కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. ఆరోగ్య, కార్మిక, రవాణా, మహిళా శిశు సంక్షేమ, ఆహార, పౌర సరఫరాలు, విద్యా శాఖలకు చెందిన ఆరుగురు మంత్రులు తులసి సిలావత్, మహేంద్ర సింగ్ సిసోడియా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇమార్తీ దేవి, ప్రద్యుమ్నసింగ్ తోమర్, ప్రభురా చౌధరితోపాటు ఎమ్మెల్యేలు సింథియా వెంట ఉన్నారు.
వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, సింథియా మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని పీటీఐ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. బెంగళూరు వచ్చిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో లేరని సిద్ధరామయ్య చెప్పినట్లు సమాచారం. అనంతరం మాజీ మంత్రి జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావుకు భోపాల్ రావాల్సిందిగా నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది.
ఏమిటీ సమస్య?
సీఎం కమల్‌నాథ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం మూడు రాజ్యసభ (కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా) సీట్ల కోసం ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాల ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవడం ఖాయం. తాజా పరిణామంతో కాంగ్రెస్‌కు మూడో సీటు దక్కడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితిని పార్టీ చీఫ్ సోనియాకు వివరించేందుకు కమల్‌నాథ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన 12న తిరిగి రావాల్సి ఉంది.
నేడు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ
16న రాష్ట్ర బడ్జెట్, 26న రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కోల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన బీజేపీ సమావేశానికి సైతం వీరు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతల్లోనూ ఉత్కంఠ పెరిగింది. రెండు రాజ్యసభ సీట్ల కోసం పార్టీ నేతలు రాంమాధవ్, కైలావ్ విజయ్‌వర్గీయ సహా 22 మంది పేర్లను సోమవారం రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment