
సీఎం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ/గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో రైతు రుణ మాఫీ, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళనలు చేపడతామంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా చేసిన హెచ్చరికపై రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ స్పందించారు. ‘ఆయన (సింధియా) తనకు నచ్చినట్లు చేయొచ్చు. ఆయన్ను ముందుగా ఆందోళనలకు దిగనివ్వండి. చూద్దాం’ అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లకు వర్తించేదే తప్ప ఐదు నెలలకు కాదంటూ వ్యాఖ్యానించారు. పంటనష్టం సర్వే, రైతు రుణమాఫీ విషయంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరచూ సింధియా తప్పుపడుతున్నారు.
సోనియానే చూసుకుంటారు!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని పార్టీ చీఫ్ సోనియా నియమిస్తారని ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శనివారం గ్వాలియర్‌లో చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు.