రాజకీయ సంక్షోభం: 18 ఎమ్మెల్యేలు మిస్సింగ్‌ | Political Crisis In Madhya Pradesh Politics | Sakshi
Sakshi News home page

రాజకీయ సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్‌

Published Mon, Mar 9 2020 7:36 PM | Last Updated on Mon, Mar 9 2020 7:57 PM

Political Crisis In Madhya Pradesh Politics - Sakshi

భోపాల్‌ : సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. గతవారం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వ్యవహరం సోమవారం నాటికి మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. అయితే వీరంతా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలివెళ్లినట్టు తెలుస్తోంది. వీరందరూ సింధియా అండతో  రెబెల్‌ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

అయితే కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియాతో కలిసి బీజేపీ కుట్రపన్నిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నా సింధియా ఢిల్లీలోనే ఉండిపోయారు. బీజేపీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరోవైపు కమల్‌నాథ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరపడ బలం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రభుత్వంపై చాలామంది సభ్యులు అసంతృప్తితో ఉన్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సింధియా వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తునట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 114 మంది ఎమ్మెల్యేలను గెలుపొంది.. స్వతంత్రులు, బీఎస్పీ సభ్యుల మద్దతుతో ప్రభుత్వం నెట్టకొస్తోంది. బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో ఓ పదిమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement