భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తనయుడు, ఎంపీ నకుల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై నకుల్ నాథ్ బుధవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘కమల్‌నాథ్ ప్రభుత్వానికి వచ్చి ఢోకా ఏమీలేదు. సర్కారు కచ్చితంగా నిలదొక్కుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. నిజానికి వాళ్లు వ్యక్తిగతంగా ఆయనను సంప్రదించలేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న 92 మంది ఎమ్మెల్యేలను మేం కాపాడుకుంటాం’’ అని నకుల్‌నాథ్ పేర్కొన్నారు. (‘నా మేనల్లుడిదీ అదే పరిస్థితి.. పిచ్చోళ్లం కాదు’ )
కాగా అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్రులు, బీజేపీయేతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 228(మొత్తం- 230 స్థానాలు.. ఇద్దరు సభ్యులు చనిపోవడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి). ఇందులో తిరుగుబాటు బావుటా ఎగురువేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సభలో సభ్యుల సంఖ్య 206కు చేరుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్ సొంత బలం 92కు పడిపోతుంది. ఇదే సమయంలో బీజేపీకి అసెంబ్లీలో 107 సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్ 104 అయినప్పటికీ.. స్పీకర్ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉన్న నేపథ్యంలో... స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీకి చెందిన ఏడుగురు సభ్యులను తమవైపునకు తిప్పుకొనేందుకు ఇరుపార్టీలు రంగంలోకి దిగినట్లు సమాచారం.(ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది)
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం: వరుస కథనాల కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment