శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
Published Thu, Feb 9 2017 11:51 AM | Last Updated on Tue, Aug 21 2018 11:58 AM
తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న శశికళా నటరాజన్‌కు అనుకోకుండా పెద్ద షాక్ తగిలింది. అత్యంత జాగ్రత్తగా బస్సులలో ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటళ్లు, రిసార్టులకు తరలించి.. వాళ్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నా, అందులోంచి ఉన్నట్టుండి 43 మంది మిస్సయ్యారు. వీళ్లంతా పన్నీర్ సెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం. తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. తన వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదవి చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న శశికళకు ఇది అనుకోని షాక్ అయ్యింది. ప్రభుత్వం నిలబడాలంటే 233 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో కనీసం 117 మంది మద్దతు అవసరం అవుతుంది. ఉన్న 130 మందిలోంచి 43 మంది వెళ్లిపోతే ఇక ఆమె వద్ద మిగిలేది 80-90 మంది మధ్య మాత్రమే. అలాంటప్పుడు ఆమె ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసినా, సభలో బలం నిరూపించుకోలేక వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలన, శాంతిభద్రతల గురించి చర్చించడానికే సీఎస్, డీజీపీలను పిలిపించినట్లు చెబుతున్నా.. నిజానికి ఎమ్మెల్యేల క్యాంప్ ఎక్కడ, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ విభాగం ఏమంటోందో తెలుసుకోడానికే పన్నీర్ వాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది.
ఇక గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చెన్నై రాజ్‌భవన్‌కు వస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు రాజకీయ నాయకులను కలుస్తారో లేదోనన్నది అనుమానంగానే ఉంది. ముందుగా ఆయన అపాయింట్‌మెంట్ తీసుకోడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ ఇచ్చి, మిగిలినది తాను సభలో నిరూపించుకుంటానని చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ముందుగా డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులను పిలిపిస్తారు. ఆ తర్వాత తనవద్ద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసుకుంటారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు సాయంత్రం తర్వాత మరింత వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Advertisement
Advertisement