రిసార్ట్ కు వెళుతున్న శశి.. క్షణక్షణం ఉత్కంఠ!
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ కోసం పోరు ఇంకా కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం శశికళ 90కి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో ఉన్న గోల్డెన్ బే రిసార్టుకు తరలించి సకల సౌకర్యాలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను నేటి సాయంత్రం శశికళ కలుసుకోనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ నేతల్లో, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిసార్ట్ ప్రాంతానికి వెళ్లే ముందు చెన్నై మెరీనా బీచ్ లో జయ సమాధిని శశికళ సందర్శించనున్నారు.
మెరీనా బీచ్ నుంచి నేరుగా తాను ఎమ్మెల్యేలను తరలించి ఉంచిన రిసార్ట్ వద్దకు వెళ్లనున్నారు. రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో నేరుగా భేటీలో పాల్గొని.. వారికి తాను ఏం చేయనున్నారో, ఎలాంటి ప్రయోజనాలు కల్పించనున్నారో వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సెల్వం వర్గంలో చేరుతుండటం ఆమె ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఈ తరుణంలో సీక్రెట్ రిసార్టుకు వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలను తనకే మద్ధతు తెలపాలని మరోమారు కోరనున్నారు. రిసార్ట్ ప్రాంతానికి ఎమ్మెల్యేలకు అవసరమైన నూతన దుస్తులు, ఇతరత్రా సామాగ్రి పంపినట్లు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయాన్ని తెలపక పోవడంతో శశికళ కష్టాలు మరింత పెరిగిపోతున్నాయి. తన కనుసన్నల్లో నడుచుకుంటున్న నేతలు పన్నీర్ వర్గంలో చేరకుండా ఉండాలంటే నేరుగా వెళ్లి వారితో చర్చించాలని శశికళ భావిస్తున్నారు.
తమిళ రాజకీయాలకు సంబంధించి మరిన్ని కీలక కథనాలు: