మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!
తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు.. అచ్చంగా జైల్లో ఖైదీలలాగే వాళ్ల పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఏ ఒక్కరూ పన్నీర్ సెల్వానికి మద్దతు పలికే ప్రయత్నం కూడా చేయకుండా చూసేందుకు శశికళ మనుషులు.. మన్నార్‌గుడి మాఫియా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. వాళ్ల పరిస్థితి దాదాపు కిడ్నాప్ అయినట్లే ఉందని అంటున్నారు. వీళ్లందరినీ సుదూర ప్రాంతానికి తీసుకెళ్లారని, ముందుగానే అక్కడ మొబైల్ జామర్లు ఏర్పాటుచేసి ఏ ఒక్కరికీ సిగ్నల్ అన్నది రాకుండా చేశారని చెబుతున్నారు. సెల్‌ఫోన్లు తీసేసుకున్నా, ఎవరివద్దనైనా రెండోఫోన్ రహస్యంగా ఉంటే అది కూడా పనిచేయకుండా ఉండేందుకు ఇలా చేశారని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లోని గోల్డెన్ బే రిసార్టులకు తరలించారు. అక్కడ వందల సంఖ్యలో శశికళ మనుషులు కాపలా కాస్తున్నారు. ఎప్పుడూ అక్కడుండే సెక్యూరిటీని పక్కకు తప్పించి మరీ వాళ్లు ఆ బాధ్యత తీసుకున్నారు.
ఎవరినీ లోపలకు వెళ్లనివ్వకుండా, ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. సాధారణ రోజుల్లో ఆ రిసార్టు వద్ద కేవలం ప్రవేశద్వారం వద్ద మాత్రమే సెక్యూరిటీ ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి వంద మీటర్లకు ఒకరి చొప్పున కాపలా కాస్తున్నారు. అలా రిసార్టుకు కిలోమీటరు దూరం వరకు ఈ సెక్యూరిటీ ఉంటోంది. ప్రధానంగా జర్నలిస్టులు, టీవీ చానళ్ల సిబ్బంది అక్కడకు చేరుకోకుండా ఆపుతున్నారు. ఎప్పుడూ రిసార్టులలో అందుబాటులో ఉండే వై-ఫైని కూడా ఆపేశారు. లాండ్‌లైన్ ఫోన్ లేదు, ఇంటర్‌నెట్ కూడా పూర్తిగా ఆపేశారు. పేపర్లు, టీవీలు ఏవీ అందుబాటులో లేవు.
అసలు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో ఆ ఎమ్మెల్యేలకు తెలిసే అవకాశం లేనే లేదు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసుకోడానికి హోటల్ సిబ్బంది కాఫీలు, టీలు ఇచ్చే వంకతో ప్రతి అరగంటకు అక్కడికెళ్లి, వాళ్ల మాటలు వింటున్నారు. ఇది కొన్ని సార్లు గొడవలకు కూడా దారితీసింది. తమ గదుల వద్దకు ఎందుకు వస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాళ్లను ప్రశ్నిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ బఫేలో ఇడ్లీ, వడ, దోశ, పొంగల్ లాంటి వాటితో పాటు మధ్యాహ్నం భోజనంలో చేపలు, మటన్ కర్రీ, రకరకాల కూరలు, బిర్యానీలు, థాలీలు, డెజర్టులు.. ఇలా అన్నీ ఉంటున్నాయి. ఇక మద్యం ప్రియుల కోసం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వీటన్నింటితో సకల మర్యాదలు చేస్తున్నా, చీమ చిటుక్కుమనగానే తెలిసేలా చిన్నమ్మ మనుషులు జాగ్రత్త పడుతున్నారు.