పార్టీ డబ్బులపై పెత్తనం నాదే: పన్నీర్
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి తిరుగుబాటు చేశారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించినా, దాన్ని ఒప్పుకోవడం లేదు. తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమమని, అందువల్ల తన అనుమతి లేకుండా ఎవరూ అన్నాడీఎంకే ఖాతాలలో ఉన్న డబ్బులు తీసుకోడానికి అనుమతించొద్దని బ్యాంకులకు లేఖలు రాశారు. ''అన్నాడీఎంకే రాజ్యాంగంలోని బై-లా 20 సబ్ క్లాజ్ 5 ప్రకారం పురచ్చితలైవి అమ్మ (జయలలిత) నన్ను అన్నాడీఎంకే కోశాధికారిగా నియమించారు. అందువల్ల పార్టీ కరెంటు ఖాతాను నా లిఖితపూర్వక అనుమతి, సూచనలు లేకుండా ఎవరూ ఆపరేట్ చేయడానికి అనుమతించొద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను'' అని కరూర్ వైశ్యాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లకు ఆయన లేఖలు రాశారు.
అన్నాడీఎంకే కార్యవర్గసభ్యులు అంటే.. కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఉప ప్రధాన కార్యదర్శి, కోశాధికారి.. వీళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యదర్శి నియమిస్తారని, సంబంధిత నియమ నిబంధనల ప్రకారం పార్టీ కొత్త అధినేతను ఎన్నుకునేవరకు వీళ్లంతా తమ పదవుల్లో కొనసాగుతారని పన్నీర్ సెల్వం అంటున్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉందని, దాన్ని ఇంకా పార్టీ రాజ్యాంగంలోని రూల్ 20 సబ్ క్లాజ్ 2 ప్రకారం భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. మొత్తం పార్టీ రాజ్యాంగాన్ని, అందులో ఉన్న నియమ నిబంధనలను కోట్ చేస్తూ ఆయన కోశాధికారిగా తన అధికారాన్ని చాటి చెబుతుండటంతో ఇప్పుడు మళ్లీ ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని అంతా ఎదురు చూస్తున్నారు.