Published
Fri, Feb 10 2017 12:29 PM
| Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారని.. నిజంగా వాళ్లు బందీలుగానే ఉన్నారా, ఎక్కడున్నా సోమవారానికల్లా అందరినీ తీసుకురావాలంటూ తమిళనాడు డీజీపీ టీకే రాజేంద్రన్‌ను మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా ఆదేశించింది. ఎమ్మెల్యేలు బందీలు కావడంపై ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. దాంతో క్యాంపు రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఇదే పరిస్థితిపై గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలపై చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎస్, డీజీపీలు గవర్నర్‌కు వివరించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు వద్దకు డీజీపీ స్వయంగా వెళ్లాలని నిర్ణయించారు.
ఎక్కడా రిసార్టు..
ఎమ్మెల్యేలను నిర్బంధించినట్లు చెబుతున్న రిసార్టు ఒకరకంగా చెప్పాలంటే దుర్భేద్యమైనది. సముద్ర తీరానికి కిలోమీటరు దూరంలో సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో ఈ రిసార్టు ఉంటుంది. దానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా పడవల్లో వెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అక్కడినుంచి తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేల మానసిక స్థితి ఎలా ఉందోనని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'సాక్షి' ప్రతినిధులు మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులకు ఫోన్లు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్విచాఫ్ అని వచ్చింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు కలిశాయి గానీ .. అప్పుడు వాళ్లు చాలా ఆందోళనకరమైన స్వరంతో మాట్లాడారు. రిసార్టులకు తాము ఇష్టపూర్వకంగా వెళ్లామా లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా తంజావూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు కాపలా ఉన్నాయి. దాంతో మీడియా కూడా అక్కడకు వెళ్లే ధైర్యం చేయలేకపోతోంది.
సుప్రీంలో శశికి ఊరట
మరోవైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది అంత అత్యవసరమైనది కాదని, అందువల్ల సాధారణ పద్ధతిలోనే ఈనెల 17న దాన్ని విచారిస్తామని తెలిపింది. దాంతో శశికళకు ప్రమాణస్వీకారం అవకాశాలు కాస్త పెరిగినట్లయ్యాయి.