ఇంతకీ.. శశికళ క్యాంపు రిసార్టు బిల్లు ఎంత?
దాదాపు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, వాళ్లకు సహాయంగా (కాపలాగా) దాదాపు మరో 200 మందికి పైగా బౌన్సర్లు దాదాపు వారం రోజుల నుంచి విలాసవంతమైన బీచ్ రిసార్టులో ఉంటున్నారు. వాళ్లకు అక్కడ సకల మర్యాదలు జరుగుతున్నాయి. మరి వీళ్లందరూ అక్కడ ఉండేందుకు ఎంత బిల్లు అయ్యిందో ఎవరైనా అడిగారా, ఆ డబ్బులు ఎవరు పెట్టుకుంటున్నారో చూశారా? గోల్డెన్ బే రిసార్ట్‌లో సుమారు 60 గదులున్నాయి. వాటిలో మూడు రకాలు ఉంటాయి. ట్రాంక్విల్ రూంలు అయితే రోజుకు రూ. 5,500 చొప్పున, బే వ్యూ రూంలు అయితే రూ. 6,600 చొప్పున, పారడైజ్ సూట్‌లు అయితే రూ. 9,900 చొప్పున అద్దెలు ఉన్నాయి.
అయితే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అన్ని రకాల గదులను రూ. 7వేల చొప్పున రోజుకు బుక్ చేసుకున్నారని అనుకున్నా కూడా.. దాదాపు ఆరు రోజులకే బిల్లు రూ. 25 లక్షల వరకు వెళ్తుంది. ఇది కాక ఇంకా ఆహారం, మంచినీళ్లు, స్నాక్స్, పండ్లు, మద్యం.. ఇతర ఖర్చులన్నీ వేరు. దాదాపు ప్రతిరోజూ రాత్రి పూట ఎమ్మెల్యేల వినోదం కోసం భారీ ఎత్తున పార్టీలు జరుగుతున్నాయని సమాచారం. సుమారు 200 మంది మాత్రమే రిసార్టులలో ఉన్నారని అనుకున్నా, వాళ్లకు తిండి, ఇతర పానీయాల ఖర్చు రోజుకు రూ. 2వేలు మాత్రమే వేసుకుంటే మరో రూ. 25 లక్షలు అవుతుంది.
బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగిన తర్వాత అటునుంచి అటే వాళ్లందరినీ రిసార్టుకు తీసుకెళ్లిపోయారు. దాంతో వాళ్లు అసలు కనీసం దుస్తులు కూడా తెచ్చుకోలేదు. దాంతో ప్రతి ఒక్కరికీ ఇన్నిరోజులకు సరిపడా కొత్త దుస్తులు కొని తెచ్చారు. దానికోసం రోజుకు వెయ్యిరూపాయలు వేసుకున్నా, ఆరు రోజులకు కలిపి రూ. 12 లక్షలు అవుతుంది. వీటితో పాటు ఎమ్మెల్యేలు ఏవైనా అదనపు సదుపాయాలు, సేవలు కోరుకుంటే వాటిని కూడా కల్పించాల్సిందే కాబట్టి వాటి ఖర్చు కూడా లెక్క వేసుకోవాలి. ఇలా చూసుకుంటే దాదాపు ఈ వారం రోజులకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది.
తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన వీకే శశికళకు తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించే అధికారం లేదని ఓ పన్నీర్ సెల్వం ఇప్పటికే చెప్పడమే కాదు, బ్యాంకులకు లేఖలు కూడా రాసేసి, అన్నాడీఎంకే పార్టీ నిధులన్నింటినీ స్తంభింపజేశారు. మరి అలాంటప్పుడు ఈ రిసార్టుల బిల్లులు ఎవరు భరిస్తున్నారో, దానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయనేది కూడా అనుమానించాల్సిన విషయమేనని అంటున్నారు.
మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి..