పన్నీర్ ఎన్ని ఎత్తులు వేసినా.. వృథా ప్రయాసే!
చెన్నై: సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ.. ఎమ్మెల్యేలను రిసార్టులో బంధించలేదని పోలీసులు తేల్చడం పన్నీర్ సెల్వం వర్గానికి కాస్త మింగుడు పడని విషయమే. తమను ఎవరూ నిర్బంధించలేదని ఎమ్మెల్యేలు చెప్పినట్లు మద్రాస్ హైకోర్టుకు పోలీసులు నివేదిక అందజేశారు. ఈ నేపథ‍్యంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అమ్మ వీరవిధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం సీఎం కుర్చీ కోసం ఎన్ని జిత్తులు వేసినా, ఎలాంటి కుట్రలకు పాల్పడ్డా అవన్నీ వృథా ప్రయాసే అవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం శశికళ అవుతారని తమ పార్టీ నేతలకు నూటికి నూరుపాళ్లు నమ్మకం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసత్వాన్ని చిన్నమ్మ శశికళ అందిపుచ్చుకుంటారని ధీమా వ్యక్తంచేశారు.
బలమైన నాయకురాలిగా, మంచి పాలనాదక్షురాలుగా శశికళ పేరు తెచ్చుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు శశికళకే ఉందని, ఆమెనే సీఎం పీఠాన్ని అధిష్టిస్తారని అన్నారు. జయలలితకు సన్నిహితురాలిగా ఉంటూ పరిపాలనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఆమెపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టులో ఉన్న 119 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. తమను ఎవరూ బంధించలేదని, స్వచ్ఛందంగా అక్కడ ఉంటున్నట్లు నేటి ఉదయం వారు పోలీసులకు వెల్లడించారు. దీంతో పన్నీర్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం శశికళ మరోసారి రిసార్టుకు వెళ్లడం.. తనకు మద్ధతివ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పన్నీర్ క్యాంపులో చేరేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడంలేదని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
తమిళనాడు కథనాలు చదవండి...
తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట
శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు!
‘అమ్మ’ కోసం అవమానాలు భరించా
పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ!
జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా?