పంతం నెగ్గించుకున్న 'చిన్నమ్మ'
చెన్నై: అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం కొలిక్కి వచ్చింది. శశికళ వర్గంతో జరిగిన పోరుతో పన్నీర్ సెల్వం ఓడిపోయారు. జైలుకు వెళ్లినా పార్టీలో 'చిన్నమ్మ' మాటే నెగ్గింది. తనపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంకు దిమ్మతిరిగేలా చేసి ఆమె కారాగారానికి వెళ్లిపోయారు. తన కనుసన్నల్లోనే కొత్త ప్రభుత్వం నడిచేలా ఏర్పాటు చేసుకున్నారు. జైలు వెళ్లే ముందు వ్యూహాత్మకంగా పార్టీలో తన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారు.
జయలలితకు విశ్వాసపాత్రుల్లో ఒకరైన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొపెట్టి పన్నీర్ కు సీఎం కుర్చీ దక్కకుండా చేశారు. 'చిన్నమ్మ' ఆశీస్సులతో సీఎం పదవిని దక్కించుకున్న పళనిస్వామి సాహసాలకు పోకుండా 'అమ్మ' కుదిర్చిన మంత్రివర్గాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. శశికళ జైలుకు వెళ్లిన మరుసటి రోజే పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మరోవైపు శశికళపై ఫిర్యాదు చేసేందుకు పన్నీర్ సెల్వం వర్గం జాతీయ ఎన్నికల సంఘం తలుపు తట్టింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం పరంగా ఏమీ చేయలేకపోయినా, కనీసం పార్టీ పరంగానైనా ఆమెను ఓడించాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్టు కనబడుతోంది. బలనిరూపణకు వరకు ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉన్నప్పటికీ సెల్వంకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనబడడం లేదు. 'విధేయుడు'కి ఓటమి అంగీకరించక తప్పేట్టు లేదు.