పన్నీర్ ఇప్పుడేం చేస్తారు?
చెన్నై: శశికళ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన పళనిస్వామికి గవర్నర్ బలనిరూపణకు అవకాశం ఇవ్వడంతో పన్నీర్ సెల్వం ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ వెంటే ఉండడంతో పన్నీర్ ఆశలకు గండిపడింది. సుప్రీంకోర్టు తీర్పు రాక ముందు వరకు శశి, సెల్వం వర్గాలకు అవకాశాలు సమానంగా ఉన్నట్టు కనబడ్డాయి. శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను తనవైపు తిప్పుకోవడంలో పన్నీర్ విఫలమవడంతో ఆయన వెనకబడ్డారు.
శశికళ జైలు శిక్ష పడడంతో పరిస్థితి తనకు అనుకూలంగా మారుతుందన్న అంచనాలు తప్పాయి. పళనిస్వామిని తెరమీదకు తీసుకొచ్చి 'చిన్నమ్మ' గట్టి దెబ్బ కొట్టారు. గవర్నర్ పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో పన్నీర్ వర్గం డీలా పడిపోయింది. బలనిరూపణకు 15 రోజులు సమయం ఇవ్వడంతో సెల్వం శిబిరం ఆశలు చిగురించాయి. తమ ముందున్న మార్గాలను పన్నీర్ వర్గం భావిస్తోంది.
1. పళని వెనుకవున్న ఎమ్మెల్యేలను బుజ్జగించి తనవైపు తిప్పుకోవడం
2. ఎమ్మెల్యేల మద్దతు పొంది బలనిరూపణలో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఓడించడం
3. శశికళతో రాజీకి వచ్చి తిరిగి అన్నాడీఎంకేలో చేరడం
4. చీలిక వర్గంగానే కొనసాగుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వరకు పోరాడటం