Published
Mon, Feb 13 2017 2:14 PM
| Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు!
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా సరికొత్త మలుపు తిరిగాయి. నిన్న మొన్నటి వరకు మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలను నిర్బంధించారని, ఒక్కొక్కరికి నలుగురు గూండాలను కాపలాగా పెట్టారని చెప్పగా.. అవన్నీ తప్పేనని చెన్నై పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రిసార్టులో మొత్తం ఎమ్మెల్యేలను నిర్బంధించి, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు స్పందించి, వారి విషయంలో వాస్తవాలు ఏంటన్నది చెప్పాలని పోలీసులను ఆదేశించింది.
దాంతో డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు రిసార్టు వద్దకు వెళ్లి, అక్కడున్న ఎమ్మెల్యేలందరితో మాట్లాడారు. అక్కడ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తామంతా స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నట్లుగా వాళ్లు తమకు చెప్పారని నివేదికలో పేర్కొన్నారు. దాంతో ఒక్కసారిగా పన్నీర్ సెల్వం శిబిరం ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అసెంబ్లీలో బల నిరూపణ వచ్చేవరకు ఇక సెల్వం క్యాంపునకు ఎలాంటి అవకాశాలు లేనట్లేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇంతకుముందు రిసార్టులలో 92 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని పోలీసుల వైపు నుంచి సమాచారం రాగా, ఇప్పుడు 119 మంది ఉన్నారని, వాళ్లలో ఎవరూ తమను నిర్బంధించినట్లు చెప్పలేదని అధికారికంగా కోర్టుకు చెప్పడంతో.. మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.