శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి: గవర్నర్ | have to verify signatures submitted by sasikala, says governor | Sakshi
Sakshi News home page

శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి: గవర్నర్

Published Fri, Feb 10 2017 11:02 AM | Last Updated on Tue, Aug 21 2018 11:58 AM

శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి: గవర్నర్ - Sakshi

శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి: గవర్నర్

తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతున్న వీకే శశికళ సమర్పించిన సంతకాలు సరైనవో కావో చూడాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భావిస్తున్నారు. దాదాపు అరగంట పాటు తన వాదన వినిపించడంతో పాటు, పది అంశాలతో కూడిన ప్రజంటేషన్ కూడా ఇచ్చిన శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతా కలిసి తనను ఎలా శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారో కూడా గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకంటే ముందుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం గవర్నర్‌ను కలిశారు. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని ఆమె కోసం వదులుకున్న వాడిగా పేరున్న సెల్వం.. ఎమ్మెల్యేలతో ఖాళీ కాగితం మీద శశికళ సంతకం చేయించుకున్నారని, ఆ తర్వాత దానిమీద తనకు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించారు. కొన్ని సంతకాలు ఫోర్జరీ కూడా చేసినట్లు ఆయన అంటున్నారు. 
 
దాంతో ఈ విషయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంతకాలన్నింటినీ సరి చూడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నాయకులను దగ్గర పెట్టుకుని సంతకాలు సరిచూడాలని, మరీ అవసరమైతే ఫోర్జరీ ఆరోపణలు సరైనవా కావా అన్న విషయం ఖరారు చేసుకోడానికి ఫోరెన్సిక్ నిపుణులకు కూడా పంపాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తనకు పార్టీలో ఎంత మద్దతు ఉందో నిరూపించుకోడానికి ఐదు రోజుల గడువు కావాలని పన్నీర్ సెల్వం గవర్నర్‌ను కోరారు. దానికి అభ్యంతరం తెలిపిన శశికళ, తనకు మొత్తం 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అందువల్ల తనకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కల్పించాలని కోరారు. అయితే.. 134 మందిలో పన్నీర్ సెల్వం వెంట కనీసం ఐదారుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సంఖ్య తప్పవుతుంది. అందుకే సంతకాల అంశాన్ని పన్నీర్ రేపినట్లు తెలుస్తోంది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement