దూకుడు పెంచిన పన్నీర్
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. ప్రస్తుతం ఎటూ ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారు కాబట్టి, తనకున్న అన్ని అవకాశాలను వదలకుండా వాడుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరికిందన్న విషయం తెలిసి.. అంతకంటే ముందే ఆయనను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేరుగా విమానాశ్రయానికే వెళ్లి విద్యాసాగర్‌రావును కలవాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్‌కు స్వాగతం పలికే అవకాశం ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి.. అక్కడే ఆయనను కలిసి తన వాదన వినిపించడం, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా వీలైతే అక్కడే ఇచ్చేయడం ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇక పార్టీ ప్రిసీడియం చైర్మన్ (గౌరవాధ్యక్షుడు) మధుసూదనన్ తమవైపు రావడం, తనకు మద్దతివ్వడం పట్ల పన్నీర్ సెల్వం సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని సంరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. శశికళ ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, సీనియర్ నాయకుడైన మధుసూదనన్‌ను సైతం ఆమె బెదిరించారని చెప్పారు. ఎమ్మెల్యేలంతా తమతోనే వస్తారని, పార్టీని కాపాడకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని అన్నారు. జయలలితను కూడా శశికళ మోసం చేశారని, పార్టీని ప్రభుత్వాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ ముఖ్యమంత్రి అయితే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని, ఆమె సీఎం కాకుండా సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు. పదవి కోసం శశికళ చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.