నోటీసులు
♦ ఓపీఎస్, శశి, టీటీవీలకు నోటీసులు
♦ రెండాకుల కేసులో ధర్మాసనం నిర్ణయం
♦ కోర్టుకు వేద నిలయం
సాక్షి, చెన్నై : రెండాకుల చిహ్నం వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఓపీఎస్(పన్నీరు సెల్వం), అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. ఇక, పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు తగ్గ చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అన్నాడీఎంకేలో వివాదాలు
రెండాకుల చిహ్నం సీజ్‌కు కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓపీఎస్, ఈపీఎస్ ఒక్కటైనా, దినకరన్ రూపంలో చిక్కులు బయలు దేరాయి. ఇక, ఈ రెండాకుల విషయంగా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ దాఖలైంది. తిరుచెందూరుకు చెందిన రామ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌లో గతంలో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల్లో చీలికలు వచ్చిన తరుణంలో, మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న శిబిరానికి అధికారిక గుర్తులను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో చీలికలు బయలు దేరడంతో 45 ఏళ్లుగా అందరి మదిలో పాతుకుపోయిన గుర్తు సీజ్ చేసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, తీర్పులను పరిగణలోకి తీసుకుని మెజారిటీ ఎటు వైపు ఉన్నదో వారికి ఆ గుర్తు అప్పగించేందుకు తగ్గ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ సూచనను న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులను జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబరు 13వ తేదీకి వాయిదా వేశారు.
కోర్టుకు వేదనిలయం :
దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్‌గార్డెన్‌లోని వేదా నిలయంను స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గ పనులకు అధికార వర్గాలు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ నిర్ణయాన్ని జయలలిత మేనల్లుడు దీపక్, మేన కోడలు దీపలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముసిరికి చెందిన తంగవేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలిత కోర్టు ద్వారా దోషిగా పరిగణించి బడినట్టు గుర్తు చేశారు.
ఆమె ప్రస్తుతం లేకున్నా, ఆ కేసులో నిందితురాలేనని పేర్కొన్నారు. అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన లావేదేవిలు, చర్చలు వేదనిలయం వేదికగా సాగినట్టుగా గతంలో కోర్టు పేర్కొందని వివరించారు. కోర్టు జాబితాలో ఉన్న ఆ వేదనిలయాన్ని ఎలా స్మారక మందిరంగా మార్చేందుకు వీలుందని పేర్కొంటూ, ఆ భవనాన్ని స్మారక మందిరంగా మారిస్తే, కోర్టులకు విలువ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. దీనిని పరిగణలోకి తీసుకుని స్మారక మందిరం పనులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి.