చిన్నమ్మ శిబిరంలో కలవరం!
చెన్నై : ‘ న్యాయం జరగాల్సిందే...ఎవ్వరికీ భయపడను, పది రోజులు గడువు ఇస్తున్నా...లేదంటే శిబిరం మారతా...’ అని అన్నాడీఎంకే సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ హెచ్చరిక చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. తమతో చేతులు కలపాలని పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు ఆయనకు ఆహ్వానాలు పలికే పనిలో పడ్డారు.
అన్నాడీఎంకే తాత్కాళిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలు జారుకుంటే చాలు ప్రభుత్వం కుప్పకూలినట్టే. ఈ సమయంలో తరచూ ఏదో ఒక ఎమ్మెల్యే చడీ చప్పుడు కాకుండా అధిష్టానానికి బెదిరింపులకు ఇవ్వడం, బుజ్జగింపుల సమయంలో తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో కోయంబత్తూరు జిల్లా సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ బహిరంగంగా ఆదివారం బెదిరింపులు ఇవ్వడం చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది.
ప్రమాదంతో బెదిరింపు : సూళూరు పచ్చపాళయంలో ఆనందకుమార్‌కు చెందిన క్వారీ ఉంది. ఇక్కడ శుక్రవారం జరిగిన ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తి వేలన్ కార్మికులు గాయపడ్డారు. శనివారం వీరు ఆసుపత్రిలో మరణించారు. ఆ కుటుంబాలకు తలా రూ.మూడు లక్షలు ముట్టచెప్పి, సాధారణ ప్రమాదంగా మార్చేసి ఆ యాజమాన్యం చేతులు దులుపుకుంది.
ఈ సమాచారంతో ఎమ్మెల్యే కనకరాజ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆదివారం ఆ క్వారీ పరిసరాల్లో పరిశీలించారు. అక్కడి ప్రజలు ఈ క్వారీ రూపంలో ఎదుర్కొంటున్న కష్టాలను, వారి గోడును విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ రూపంలో తన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. ఇక, తానెవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని, సీఎం పళనిస్వామికి కూడా భయపడనని స్పష్టం చేశారు.
క్వారీకి శాశ్వతంగా తాళం వేయడం, ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. పది రోజుల్లో న్యాయం జరగని పక్షంలో, ప్రజలు కోరుకునే శిబిరంలోకి చేరాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాను వెనక్కు తగ్గనని, చిన్నమ్మ శిబిరంకు గుడ్‌బై చెప్పి మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన ఆ ప్రకటన చేశారో లేదో ఆగమేఘాలపై మంత్రి ఉడుమలై కే రాధాకృష్ణన్ కనకరాజ్ ఇంటికి చేరుకుని బుజ్జగించారు. ఇందుకు ఏ మాత్రం ఆ ఎమ్మెల్యే తగ్గని దృష్ట్యా, నిరాశతో వెనుదిరిగారు.
ఇక, తమ శిబిరం వైపు త్వరితగతిన వచ్చేయాలని మాజీ సీఎం పన్నీరు మద్దతు ఎమ్మెల్యే కనకరాజ్‌కు పిలుపునిచ్చే పనిలో పడ్డారు. ఇక, జయలలిత మేన కోడలు దీప పేరవైలో కీలక నేతగా ఉన్న తిరుచ్చికి చెందిన మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ టాటా చెప్పేసి పన్నీరు శిబిరం వైపుగా వచ్చేశారు. వస్తూ వస్తూ, దీపకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పేరవై వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. ఆయన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసే పనిలో దీప మద్దతు సేన నిమగ్నమైంది.