సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు కీలక నేతలతో సంప్రదింపుల కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థి బీజేపీనే అని చాటి చెప్పడంతో పాటు.. పార్టీలో చేరే నేతలకు అన్నివిధాలా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి బలంగా ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
తాము టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బహిర్గతం అవుతోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులను సైతం చేర్చుకునేలా బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక ఇప్పటికే ఖాయమైందని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం. కాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కీలక దశలో చర్చలు
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈటల బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు వేగం పుంజుకున్నాయి. జిల్లాల వారీగా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించడంతో పాటు వారు బీజేపీలో చేరేలా చర్చలు సాగుతున్నాయి. ఇతరత్రా హామీలతో పాటు పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వచ్చే నెలలో పార్టీలో చేరతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆయన చేరిక నల్లగొండ జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని, మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి రావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులు, కీలక నాయకులు ఎంతోమంది ఉన్నారని.. ప్రస్తుతానికి ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలతో, పాటు బలమైన నాయకులతో చర్చల ప్రక్రియ కీలక దశలో ఉన్నట్టు బీజేపీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
భరోసా ఇస్తున్న బీజేపీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరికలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని, పార్టీలోకి వచ్చే ప్రజాప్రతినిధులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాపులారిటీని కూడా గమనంలోకి తీసుకుంటున్నట్లు బీజేపీ నేత తెలిపారు. అసంతృప్తితో ఉన్న ప్రజాప్రతినిధుల్లో కొందరు శాసనసభ్యులు.. ఇప్పటికిప్పుడు బయటకు వస్తే అనవసర వేధింపులు, కేసులు కొనసాగుతాయని, నియోజక వర్గాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా ఆపేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అలాంటి భయాలు అక్కర్లేదని భరోసా కల్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
పలువురు ముఖ్య నేతలు రెడీ!
ఖమ్మం నుంచి మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ ఆయన రావడంతో ఆ జిల్లాలో బీజేపీకి బలం గణనీయంగా పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఈటల అధ్యక్షతన ఏర్పాటైన చేరికల కమిటీ నాయకుడొకరు వ్యక్తం చేశారు. అదే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని కూడా చేర్చుకునే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలిసింది. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ఓ మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే టీఆర్‌ఎస్ పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన తేజవత్ రామచంద్రు పార్టీలో చేరతారని అంటున్నారు. అదే విధంగా ఆ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం ఉందని సమాచారం. ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్న ఓ వ్యాపారవేత్త బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
నల్లగొండలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరికి కీలక పదవి కట్టబెట్టి పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై బీజేపీ నేతలు చర్చించినట్లు తెలిసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీజేపీలోకి వస్తారని అంటున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment